Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/338

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిశీలిస్తే ఒకనాడు దక్షిణ భారత దేశమంతా అనేక పర్యాయాలు, అనేక చక్రవర్తుల ఏలుబడిలో ఏక ఖండంగా వుంది. కృష్ణదేవరాయల పాలనలో కన్నడ, తెలుగు, తమిళ రాస్ట్రాలు కలిసే వుండేవి. ఆనాడు ఆంధ్ర కళారూపాలు విజయనగరం తంజావూరు సరస్వతీ మహల్ యక్షగానాలూ, తెలుగు నాటకాలను ప్రదర్శించే మేలటూరు భాగవత మేళాలు ఉదహరణలుగా నిలిచి వున్నాయి. ఈ విధంగా ఆ యా కాలల్లో కళల యొక్క సారస్వతం యొక్క ప్రభావం ఆయా జాతుల మీద పడి వుండవచ్చు. అందువల్ల ఏ కళారూపం ఎక్కడి నుండి దిగుమతి అయిందనే మీమాంసకు తావు లేదు. కాని ఇందుకు ఉదాహరణగా తిరుమల రామచంద్రగారు 'జయంతి ' పత్రికలో బుర్రకథ తెలుగు వారి సంగీత కళారూపమే ననీ అది ఎక్కడనుండో దిగుమతి కాలేదనీ, కన్నడ మహారాష్ట్ర కళారూపాలైన పవాడా, లావణీలకూ మన బుర్రకథకూ వున్న వ్వత్యాసాలను గురించి చర్చిస్తూ ఈ క్రింది విధంగా ఉదాహరించారు.

తెలుగు బుర్ర కథకు, మహారాష్ట్రుల పవాడాకు, కన్నడుల లావణీకి, జానపదకళారూపా'లనడం తప్ప మరేమీ పోలిక లేదు.

పవాడాను కూర్చుని , నిలబడీ పాడుతారు. ఇది మన భజన గోష్ఠిలాంటిది. ఈ కథలో వీరరసం ప్రాధాన్యం వహిస్తుంది. వెనుక వంతదార్లు _ పురుషులు _దీదీ దీదీ అంటూ వంతరాగాలు పాడుతారు.

బుర్రకథలో మాదిరి అభినయం గానీ, నిలబడి నృత్యం చేయడం గానీ పవాడాలో లేదు. ఇక కన్నడ లావణీ ప్రాచీనమైనది. 16వ శతాబ్దంనుంచీ లావణీ ప్రచారంలో వుంది. పదిహేడవ శతాబ్దంలో నంది వర్మ దీనిని తన ఛందో గ్రంథంలో ఉదహరించి లక్షణం చెప్పాడు.

లావణి అనేది జనపద గాథలను తెలిపే ఛందోవిశేషం. ఇవి గ్రామీణ జీవిత గాథలను వివిధ రసాలతో ప్రకృతి సౌందర్యాన్ని వివిధ రీతులలోను వర్ణిస్తుంది. ఇద్దరు గాని ఒక్కరు గానీ నిలబడి పాడుతారు. దీనికి వంతపాట వుండదు. దీనికీ మన బుర్రకథకూ నిలబడి పాడడమనే పోలిక తప్ప మరే పోలికా లేదు.

పోతే మరాఠీలో కూడా లావణి వుంది. దానిలో స్త్రీలు పాడడం, చేతులు త్రిప్పడం వంటి అంగికాభినయం వుంది. కాని కథా విధానం వుండదు. గుమ్మెట్ల వంటి వాద్యాల ప్రసక్తి లేదు. అది కేవలం పేరంటపు పాటల వంటిది కావచ్చు. పై