Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నున్న వంతదారులు రెండు గుమ్మెటలను భుజాలకు తగిలించుకుని 'దద్దోతిమి, తదిమి తత్తద్ధిమి, తకిట తతధిమి, దింతక్క దాతద్దిందా, తక తక్కి, తకతక్కా' అనే దరువు వేస్తూ 'తదిగిణతోం' అంటూ మధ్య గమకాలనిస్తూ కథా సన్నివేశాల ననుసరించి మధ్య మధ్య అరరె, భళీ, భళీ అంటు కథకుడికి హుషారు నిస్తూ, వుధృతంగా నృత్యం చేస్తూ ప్రజల కందుబాటులో అన్ని ప్రక్కలకు తిరుగుతూ వుంటారు. కథకుని లయ ప్రకారం, వంతలు గమకంగా వాయిస్తారు. కథకుడు చక్కగా చరణం పాడితే దానిని వంత దార్లు తిరిగి వంత పాడుతారు. కథకుడు కధను వివరిస్తే మరో వంతదారు (ఇతడు హాస్యగాడు) ప్రేక్షకులకు వచ్చే అనుమానాలను హస్య ధోరణిలో కథకుని ప్రశ్నించి, సున్నిత హాస్యంతో ప్రజలను ముగ్ధుల్ని చేసి కథను ముందుకు నడిపేవారు. ఈ హాస్యం వల్ల పరాకుగా వున్న ప్రేక్షకులందర్నీ ఒక హద్దులో వుంచి కథను వినేటట్లు అభిలాషను కలిగించేవారు. కథకునికీ, వంతలకూ మధ్య నున్న అవినాభావ సంబందం అంతా ఇంతా అని చెప్పలేం. కథా గమనంలో ఆయా ఘట్టాలలో ఎక్కడా వీసమంత వెలితి రానీయరు. కావాలనుకున్నప్పుడు ప్రేక్షకులను వవ్వించగలరు, ఏడ్పించగలరు, వుదృేకపరచగలరు.కథను విన్న ఆ కొంచెంసేపూ ప్రేక్షకులను ఒడలు మరచేటట్లు చేయగలరు. వంతలు కథను ఆలాపిస్తుంటే కథకుడు చేతిలో వున్న అందెలతో బాటు ఒక అందమైన చేతి గుడ్డను వూపుకుంటూ రెండవ చేతితో తంబురాను మీటుతూ, కాళ్ళ జగ్గెలు ఘల్లుమనేటట్లు నృత్యం చేస్తూ అటూ ఇటూ చేతులు వూపుకుంటూ సాత్విక, ఆంగిక చలనాదులతో రంగస్థలం అంతా కలియ దిరుగుతూ యుద్ధఘట్టాల లోనూ, రౌద్ర ఘట్టాలలోనూ పిడుగులు బడ్డట్లు ఎగిరి ఎగిరి గంతులు వేస్తూ, గిఱ్ఱుగిఱ్ఱున గిరికీలు కొడుతూ, పళ్ళు పటపట కొరుకుతూ అరరే, అరరే అంటూ వంతలను కేకలతో ఆదలిస్తూ హంగామా చేసి ప్రేక్షకులను నివ్వెర పోయేటట్లు చేసేవారు. పైన వివరించిన ప్రదర్శన విధానాన్ని బట్టి, జంగం కథా కళారూపం ఎంత పదునైనదో మనకు బోధపడుతుంది. ముగ్గురు వ్వక్తులతో కూడిన ఈ కళారూపం యొక్క ప్రాముఖ్యం అనిర్వచనీయమైనది. ఇది ఇంతటి వుత్తమ కళాయుధం గనుకనే చారిత్రాత్మకంగా ఆంధ్ర ప్రజాహృదయాలలో హత్తుకు పోయింది.

బుర్రకథ అంటే?

ప్రజాహృదయాలను ఇంతగా చూరగొన్న ఈ జంగం కథల యొక్క పూర్వ చరిత్ర మనకు సరిగా తెలియడం లేదు. జంగం కథగా వర్దిల్లి ఈ కళారూపం నేడు