Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
మాణిక్యాల పురం విప్ర వినోదులు:

తెలంగాణాలో ఈ విప్ర వినోదులు కరీంనగర్ జిల్లా మాణిక్యాల పురంలో వున్నట్లు తెలుస్తూంది. వీరి వృత్తి విప్రులను యాచించడమే. వీరి ప్రదర్శనం కూడ ఇంద్రజాలమే. వీరి దళ సభ్యులు నలుగురుంటారు. వీరి ప్రదర్శనం విప్రుల ఇండ్లలోనూ, విశాల బహిరంగ స్థలాల్లోనూ కూడ ప్రదర్సిస్తారు. వీరి ప్రదర్శన సామాగ్రి అయిదు శాలువలు, ఒక కొయ్య అలమారా, ఒక తాళపత్ర గ్రంథం, రెండు జతల తాళాలు. ప్రదర్శనం విశాల ప్రదేశంలో ఒక చిన్నపందిరిలో జరుగు తుంది. పందిరి చుట్టూ శాలువలు కడాతారు. ఆ తెరల మధ్య ఖాళీ అలమారా వుంచుతారు. ఇరువురు వ్వక్తులు చెరో ప్రక్క చేరి తాళాలతో భజన చేస్తారు. ఇంతలో ప్రేక్షకులు గుమి కూడతారు. తెరలన్నీ ఎత్తి ఖాళీ అలమారా చూపిస్తారు. తరువాత దళ సభ్యుడు ప్రాచీన తాటాకుల గ్రంథంతో తెరల మధ్యకు వెళతాడు. ఒక పావు గంట వరకూ ఆయన బయటకు రాడు. ఈ లోగా భజన జరుగుతూనే వుంటుంది. లోపల ఏం జరుగుతూందో అనే ఆసక్తి ప్రేక్షకులలో రేకెత్తిస్తుంది.

ఇంతలో తెరను తొలగిస్తారు. అదివరకు ఖాళీగా వున్న అలమారాలో దేవతా విగ్రహాలు, దీపారాధన కుందులూ, పుష్పాలూ, ఫలాలూ, పిండివంటలూ, గంట, శంఖం వివిధ పూజా పాత్రలు అనేక రకాల పిండి వంటలు ప్రత్యక్షమౌతాయి. అలాగే ఒక మామిడి టెంకను పాతి పెట్టి పది నిమిషాల్లో అడుగు ఎత్తున పెరిగిన మామిడి మొక్కను చూపిస్తారు. ఈ ప్రదర్శనం ప్రేక్షకులను ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. ప్రదర్శనానికి ముందే అలమారాలను పరీక్షించ వచ్చు. అంతే కాక వీరు ఇంటింటికి తిరుగునప్పుడు విగ్రహాలను, కప్పలను చిలకలను, విభూతిని అరచేతిలో సృష్టించి ఇంద్రజాల మహేంద్రజాల విద్యను ప్రదర్శిస్తారు.

రాయలసీమ విప్రవినోదులు:

విప్రవినోదులు జాతర్ల లోనూ, తిరునాళ్ళలోనూ, గుడారాలను నిర్మిస్తారు. ఈ గుడారాల్లో రామాయణం మొదలైన కథలను అత్యద్భుతంగా చిత్రిస్తారు.

వీరు గొప్ప మాటకారులు, హాస్య ప్రియులు. చెప్పింది చెప్పకుండా చెపుతారు. ప్రేక్షకులను తమ హాస్య ప్రసంగాలతో ఆనందంలో ముంచెత్తుతారు.