Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరు భలే తమాషాలు చేసి, ప్రేక్షకులను ఆనంద పరుస్తారు. వీరు ముందు మన పేరు అడిగి తెలుసుకుంటారు. దూరంగా వుండే తమ జట్టు వారికి అర్థమయ్యే రీతిలో, పద్యాలద్వారా, సైగలు ద్వారా, మన పేరును తెలియ చేస్తారు. వారు అక్కడ నుంచే మన పేరులను వారితోనే చెప్పించి చుట్టూ మూగిన ప్రేక్షకులను ఆశ్చర్య చికితుల్ని చేస్తారు.

వీరు రాయల సీమ ప్రాంతాల్లో ఒకప్పుడు విరివిగా ప్రదర్శనలిచ్చే వారు. ఈ నాడు వీరి జాడవున్నట్లు అధారాలు లేవు.

విప్రవినోదుల రోప్ ట్రిక్:

విప్రవినోదులు ఆ రోజుల్లో రోప్ ట్రిక్ ను చేసేవారు. అంటే ఒక త్రాడును ఆకాశంలో ఎగరేస్తే అది అలాగే నిలబడితే, దానిమీద మనిషి ఎక్కి అంతర్ధాన మయ్యేవాడట. ఎలా మాయమయ్యేవాడో వివరంగా ఇంద్ర జాలం శీర్షికలో వివరించ బడింది.

ఇలా ఆరోజుల్లో రోప్ ట్రిక్ చేసే విప్రవినోదులు, కృష్ణా నదీ ప్రాంతంలో నివసించేరారట. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో ప్రదర్శించిన ఒక అద్భుత కార్యం. ఆ కాలంలో మన దేశానికి వచ్చిన విదేశీయు లెందరో ఈ అద్భుతమైన ఇండియన్ రోప్ ట్రిక్ ను ఎంతగానో ప్రశంచించారు. ఇది విప్ర వినోదుల విద్య.