పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/308

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తురక జాతికి చెందిన వాడు సిద్దీ... ముఖానికి నల్లటి రంగు పూసుకుని, రెండు అంగుళాల పొడవైన గడ్డం పెట్టుకుని, చొక్కా పైన వేస్టు కోటు ధరించి టర్కీ టోపీ, సిల్కు లుంఘీ, బఫూన్ లా వుంటాడు.

కంచెనీ అంటే భోగంవారు. నాట్య కత్తెలైన వీరు ఇద్దరు ముగ్గురుంటారు. వీరు జావళీలనూ, కృష్ణ శబ్దాన్ని, మండూక శబ్ధాన్ని, దశావతారాలనూ, అష్టపదులను, తరంగాలను, అధ్యాత్మిక రామాయణ అకీర్తనలనూ, త్యాగరాయ కీర్తనలు పాడుతూ; సుందరంగా నృత్యం చేస్తూ చక్కగా ఆభినయిస్తారు. వీరికి హంగుగా, హర్మోనీ వాయించేవారూ మద్దెల వాయించే వారూ వుంటారు.

ఇంతలో సిద్దీ ప్రవేశించి నేనిక్కడ పాదుషా వారి కాపలాదారుననీ, అల్లరి చేయ వద్దనీ.. అంటాడు.

సోమయాజులు, సోమిదేవమ్మ

వినోదం కలిగిస్తూ, నవ్విస్తూ, పరిహసిస్తూ సంఘంలోని దురాచారాలను, దుర న్యాయాలను, బట్టబయలు చేస్తూ సాంఘానికి దర్పణంగా దిక్చూచిగా వ్వహరించటమే పగటి వేషాల ప్రధాన ఆశయం.

పాతోచిత భాషతో జాను తెలుగు నుడికారంతో వెలువడే వేషాలలో సోమయాజులు, సోమిదేవమ్మ వేషం ముఖ్యమైనది.

కుహనా వైదిక మతస్థులను పరిహిసించడమే ఈ వేషం యొక్క పరమాశయం. ఇందులో మూడే పాత్రలు. ఒకటి సోమయాజులు, రెండు సోమిదేవమ్మ, మూడు శిష్యుడు. ఈ మూడు పాత్రల సంభాపణలూ వ్వంగ్యార్థాలతో కూడి చమత్కారంగా వుంటాయి. ఈ పాత్రలు, పంచాంగ శ్రవణాన్నీ, రామాయణ శ్రవణాన్ని వైదిక కార్య కలాపాల్ని అవహేళన చేశాయి. ఒక రకంగా చూస్తే ముసలి మొగుడు, పడుచు పెళ్ళాం మనస్తత్వాలను తెలియచేసేవే ఈ రెండు వేషాలు. సోమయాజులు ముసలివాడు. ఆయన భార్య సోమిదేవమ్మ పడుచు పిల్ల. వీరిద్దరి మధ్యా ఆసులో గొట్టంలా ఒక శిష్యుడు. ఆ దంపతుల మధ్య సంవాదం ఇలా సాగుతుంది.