Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైఖరులు, చమత్కార సంభాషణలూ, అచ్చం అలాగే తెలుపుతారు. సోమివేదమ్మ పాత్రలో వైదిక సంఘంలో వుండే మంచి చెడులనూ లోపాలనూ వెల్లడిస్తారు. తర్క శాస్త్రాన్నీ, వ్యాకరణ శాస్త్రాన్ని, వేద స్వరూపాన్నీ హాస్య పూరితులైన సంస్కృత శ్లోకాలను కలిపి కట్టుదిట్టంగా చర్చించేవారు.

చిట్టిపంతులు వేషంలో, చిట్టిపంతులు వేశ్యాలోలుడై వ్యాపారులనూ, రైతులనూ బాధించి ఏ విధంగా ధనమార్జిస్తారో ఆర్జించిన ధనమంతా వేశ్యలకెలా ధార పోస్తాడో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు.

యాచనలో ప్రతి వారినీ పొగడుతూ భట్రాజులు ప్రజలను ఎలా పీడిస్తారో చూపించేవారు.

ఖురాన్ చదువుతూ, పాడిపంటల్ సల్ల గుండాలి అల్లాకెనాం, అంటూ ఫకీర్ల వేషంలోనూ, అంబ పల్కు జగదాంబ పల్కు, మాయమ్మా పల్కు, కంచి కామాక్షి పల్కు, అంటూ బుడ బుక్కల వేషంలోనూ, ఆ యా పాత్రలకూ, ఆయా వేషాలకూ కా వలసిన అన్ని రకాల సాహిత్యాన్ని ఆకళింపు చేసుకుని, ఆయా వేషాలను సజీవంగా ప్రదర్శించేవారు.

సున్నపు వీరయ్య పగటి వేషాలు

పగటి వేషధారుల్లో బహుముఖ ప్రజ్ఞావంతుడు క్రీ॥శే॥ సున్నపు వీరయ్య గారు పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరుకు దగ్గరగా నున్న అప్పారావు పాలెం, తరువాత ఏలూరు స్తిర నివాసంగా చేసుకుని రాష్ట్ర వ్వాపితంగా పగటి వేషాలను ప్రదర్శించి బహురూప చక్రవర్తిగా ప్రశంస లందుకున్నారు.

ఇంటిపేరు సున్నంవారు విశ్వబ్రాహ్మణ కులానికి చెందినవారు. ఆజాను బాహుడు, నిండైన విగహం, స్థూలకాయుడు, పెద్ద జరీ అంచు తెల్లని తలపాగా ధరించేవారు. బొద్దు మీసం నల్లని లాంకోటు, తెల్లని పంచకట్టు, చేతికి సువర్ణ కంకణాలు, కాలికి పెద్ద అందె ధరించి కిఱ్ఱు చెప్పులతో బయలు దేరితే చూచే వారికి అమిత గంభీరంగా కనిపించేవారు. అలాంటి నిండైన విగ్రహం, ఆంధ్రదేశంలో పగటి వేషధారుల్లో మరెవరికీ లేదనడం అతిశయోక్తి కాదు.