పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కథను కీర్తనలుగా పద్యాలుగా వారి వారి ఇష్ట ప్రకారం చేసి పాడేవారు. అయా ఘట్టాలలో కేకలు వేసి ప్రేక్షకులను ఉత్తేజ పర్చేవారు. ఈ నాటకాలను ప్రదర్శించే మాల వారు బ్రాహ్మణులను ఆశ్రయించే వారు కారు.

పాత్రలన్నిటినీ పురుషులే ధరించేవారు. సీతారామ లక్ష్మణుల అరణ్య వాసము, లక్ష్మణ మూర్చ, సీతమ్మ శోకము ప్రదర్శించేవారు. సీతమ్మ శోకం ప్రదర్శించేటప్పుడు ప్రేక్షకుల కళ్ళ వెంట నీరు పెట్టుకునేవారు. ఒకనాటి ప్రదర్శనానికి ప్రదర్శకులందరికీ ఇంటి కొకరి చొప్పున భోజనం పెట్టి వడ్లు, దుస్తుల్ని ఇచ్చేవారు. ఆ రోజుల్లో వారు గ్యాసు లైట్ల భరించలేక, ఆముదపు దివిటీల వెలుగుతురులో ఈ నాటకాలను ఆడేవారు. దివిటీలకు గాను ఆముదాన్ని నాటకాన్ని ఆడించే వారే ఇచ్చేవారు. ఆ రోజుల్లో పేదవారికి ఈ ప్రదర్శనాలు కన్నుల పండువుగా వుండేవి. తెల్ల వారేవరకూ ప్రదర్శించి తెల్లవారి ఇళ్ళకు వెశ్శి వ్యాచించేవారు.

యానాదుల భాగవతాలు

ఆంధ్ర దేశంలో కూచిపూడి వీథి భాగవతాలు రాష్ట్ర వ్వాపికంగా ప్రచారం పొందాయి. అయితే ఆయా ప్రాంతాలలో తూర్పు భాగవతమనీ, చిందు భాగవతమనీ, గొల్ల భాగవతమనీ, మాల భాగవతమనీ, ఇలా ప్రాంతీయంగా ప్రాచుర్యం పొందిన కళా రూపమే యానాదుల భాగవతం. కేవలం యానాదులు భాగవతాలకే పరిమితం కాక వివిధ కళారూపాలను కూడ ప్రదర్శిస్తారు.

ఈతరం వారికి తెలియక పోవచ్చును గానీ, నా చిన్నతనంలో, ఏవిటిరా ఆ యానాది కళలూ, యానాది గంతులూ, యానాది చిందులూ, అనే మాటలు వింటూ వుండే వాడిని. దీనిని బట్టి యానాదుల కళలు కొన్ని వున్నాయనీ, మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ యానాదులు ఆంధ్ర దేశ మంతటా వున్నారని మనం చెప్పలేము. యానాదులు ఎక్కువగా, నెల్లూరు, గుంటూరు జిల్లాలలో ఎక్కువగా వున్నారు. వీరి అసలు వృత్తి ఒకప్పుడు బందిపోటు దొంగల బారినుండి గ్రామాలను కాపాడే కాపలాకాయడం. రాత్రిళ్ళు ఊరంతా వీథుల్లో తిరగటం పొలాల వద్ద పంటలను కాపాడటం.