పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకనాడు కూచిపూడి భాగవతుల ప్రభావం, అనేక జాతులమీదా, కులాల మీదా పడినట్లే ఒక నాటక సమాజాన్ని చూసి, అనేక సమాజాలు ఉద్భవించినట్లే యానాదుల మీద కూడా ఆ ప్రభావం పడింది.

యానాది భాగవతులు:

యానాదుల్లో ఉత్సాహవంతులైన యువకులు ఒక ప్రక్క వూరి కాపలా చూసుకుంటూ భాగవతాలు నేర్చుకుని, జట్టులు జట్టులుగా, ఏబై సంవత్సరాల క్రితం సర్కారు జిల్లాలలో ప్రదర్శనాలు ఇస్తూ వుండేవారు. యానాది భాగవతుల్లో కుటుంబమంతా భాగవతాల్లో పాత్రలు ధరించేవారు. ఆనాడు ముఖ్యంగా కూచిపూడి భాగవతుల్లో పురుషులే స్త్రీ పాత్రలు ధరించేవారు.

యానాది భాగవతాల్లో ముఖ్యంగా స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించడం వల్ల ప్రేక్షకుల్ని అధికంగా ఆకర్షించేవారు. దాదాపు జట్టులోని వారందరూ పాత్రలు ధరించినా, ఏదో ఒక వాయిద్యాన్ని కూడా వాయించ గలిగేవారు. ముఖ్యంగా వీరి నాటకాల్లో ప్రతి పాటకూ నృత్యం చేసేవారు. ఆ నృత్యం సున్నితంగా కాక కొంచెం మొరటుగా వుండేది. చిందులు మాత్రం ఉదృతంగా త్రొక్కేవారు. అందుకే యానాది చిందులనే పేరు వచ్చిందేమో.

పూట భోజనం, పది రూపాయలు:

ఒక రాత్రి ప్రదర్శనానికి, రాత్రి పూట అందరికీ భోజనాలు పెట్టి పది రూపాయలిస్తే చాలు. ప్రదర్శనం తెల్లవార్లూ జరిగిపోతుంది. వీరి ప్రదర్శనాలు అంత శాస్త్రయుక్తంగా లేక పోయినా ముఖ్యంగా యవ్వనంలో వున్న స్త్రీ పాత్రల అభినయమూ, సంగీతమూ ప్రేక్షకుల్ని మాత్రం అమితంగా ఆకర్షించాయి.

వీరు ప్రదర్శిచే భాగవతాలు, ఉషాపరిణయం, కృష్ణ లీలలు, సావిత్రి, శశిరేఖా పరిణయం మొదలైనవి ప్రచారం పొందాయి. వీరి వాయిద్యాలు - మద్దెల - తాళాలు __