పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూచిపూడి నృత్యంలో ప్రవీణురాలైన, యామినీ కృష్ణమూర్తి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి గోపాలశర్మ, చింతా కృష్ణమూర్తి మొదలైన వారి వద్ద నృత్యం నేర్చుకుని విదేశాలలో కూచిపూడి నృత్య కళకు పేరు తీసుకువచ్చారు. ప్రభుత్వం పద్మ శ్రీతో గౌరవించింది.

ఎం.ఏ. పట్ట భద్రులైన కోరాడ, అంతర్జాతీయ నృత్య సదస్సు పారిస్ లో జరిగినప్పుడు కూచిపూడి నృత్యం ప్రదర్శించి ప్రథమ పురస్కారాన్ని అందుకున్నారు. గుడిమెట్ల కృష్ణ, వేదాంతం లక్ష్మినారాయణ శాస్త్రి గార్ల వద్ద విద్య నభ్యసించి 1957 లో ఢిల్లీలో జరిగిన ప్రజా నాట్యమండలి మహా సభలో కూచి పూడి నృత్యం ప్రదర్శించి ప్రథమ బహుమతి నందుకున్నారు.

అన్నినృత్యాలనూ ఆకళింపు చేసుకున్న డా॥నటరాజరామకృష్ణ కూచిపూడి నృత్యంలో ఆరితేరి దేవదాసీ నృత్య సంప్రదాయాన్నీ ఆంధ్ర నాట్యాన్నీ పునరుద్ధరించి నృత్యకళమీద ఎన్నో గ్రంథాలను వ్రాసి, ఎంతో మంది శిష్యులను తయారు చేసి నృత్య కళకు ఎంతో సేవ చేసిన రామకృష్ణగారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం - కళాప్రపూర్ణ నిచ్చి గౌరవించింది.

సంగీత నాటక అకాడమీ భరతకళా ప్రపూర్ణ బిరుదునిచ్చింది. నిజమైన కళా తపస్వి నటరాజ రామకృష్ణ గారు.

అలాగే విజయనగరానికి చెందిన డి.వై.సంపత్ కుమార్, దువ్వూరి జగన్నాథశర్మ వద్ద నృత్యం నేర్చుకుని గీతాంజలి, నృత్యాంజలి సంస్థలను స్తాపించి, శాస్త్రీయ జానపద రీతుల్ని వెలుగు లోకి తీసుకువచ్చి, రాధాకృష్ణన్ లాంటి వారి ప్రశంసల నందుకున్నారు. ఆంధ్ర జాలరి నృత్యాన్ని 1968 లో బెర్లిన్ అంతర్జాతీయ యువజనోత్సవాలలో ప్రదర్శించి బంగారు పతకాన్ని అందుకున్నారు. జానపద నృత్యాలను ప్రచారంలోకి తీసుకువచ్చారు. అంధ్ర విశ్వవిద్యాలయం, కళా పూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది.

పైవారే కాక, రాజారెడ్డి, రాధారెడ్డి బృందం ఢిల్లీని కేంద్రంగా చేసుకుని కూచిపూడి నృత్యాన్ని ఇతర దేశాలలో ప్రదర్శించి ప్రఖ్యాతి వహించారు.