పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రేక్షకులను ఏ విధంగా ఎందుకు ఆకర్షిస్తున్నాయో ఆ కీలకాలన్నిటినీ తెలుసుకొని భాగవత సాంప్రదాయాలలో కొంత సంస్కారం తీసుకువచ్చి, తెరలు, హర్మోనియం, పద్యాలు, పాటలు, చెమ్కీ దుస్తులు ప్రవేశపెట్టి భరత నాట్య సంప్రదాయాల ననుసరించి ప్రదర్శనాలను ఇచ్చారు.

ఎందరో నిష్ణాతులు:

ఈనాడు కూచిపూడిలో వెనుకటి వైభవం లేదు. ఆ తరం వారెవ్వరూ లేరు. ఆ నాటకాలను ప్రదర్శించే వేదాంతం సత్యనారాయణగారు తప్ప మరొకరు లేరు. ఆయన స్త్రీ పాత్రలో, భామా కలాపాన్ని అభినయించడంలో దిట్ట. పద్మశ్రీ అవార్డులతో పాటు ఎన్నో అవార్డుల నందుకున్నారు.

కూచిపూడి నాట్యం జానపద నాట్యంమే కాని దానికి శాస్త్రీయత లేదని కొందరు వక్ర భాష్యాలు చెప్పారు. కూచిపూడి నృత్యాన్ని శాస్త్రీయ నృత్యంగా గుర్తింపు తీసుకు రావడానికి సంగీత నాటక అకాడమీ ద్వారా కృషి చేసి, శాస్త్రీయ నృత్యంగా స్థిరపరచారు. ఇందుకోసం ఎందరో మహానుభావులు కృషి చేసారు.

శిధిలమౌతున్న కూచిపూడి నృత్య కళను పునరుద్ధరించటానికి సిద్ధేంద్ర కళా క్షేత్రాన్ని ఎర్పాటు చేసి గురుకుల పద్ధతిలో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ, సంగీత నాటక అకాడమీ గ్రాంటుల నిచ్చి పోషించింది. సిద్ధేంద్ర కళాక్షేత్రాన్ని ఈనాడు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకుని కూచిపూడి నృత్య కళను కాలేజీ స్థాయిలో పాఠ్యాంశంగా చేయాలని కృషి చేస్తూ వుంది. కూచిపూడి వీథినాటకాన్ని ఇటీవల వేదాంతం సత్యనారాయణ గారు వెలుగు లోకి తీసుకువస్త్గే, మరో ప్రక్క వెంపటి చిన సత్యంగారు ముప్పది సంవత్సరాలుగా మద్రాసులో కూచిపూడి ఆర్టు అకాడమీని స్థాపించి, ఎంతో మంది ప్రముఖులకు కూచిపూడి నృత్య కళలో శిక్షణ నిచ్చి... పద్మావతీ శ్రీనివాస కల్యాణం లాంటి నృత్య నాటకాలను కూచిపూడి శైలిలో తయారుచేసి దేశం అన్ని ప్రాంతాల్లోనూ, విదేశాల్లోనూ ప్రదర్శనాలను ప్రదర్శించి కూచి పూడి నాట్యానికి విశ్వ విఖ్యాత కీర్తిని సాధించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సత్యంగారికి, కళా ప్రపూర్ణ బిరుదు నిచ్చి సత్కరించింది. ఇంకా మరెన్నో అవార్డుల నందుకున్నారు. ఈనాడు అడయారులో, కూచిపూడి ఆర్టు అకాడమీ పేరున స్వంత భవనాలను నిర్మించి , దాని నొక విఖ్యాత కూచిపూడి నృత్య కళా కేంద్రంగా తీర్చి దిద్దటానికి కృషి చేస్తున్నారు.