విధంగా వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చే ఇటువంటి ప్రమాదాల నన్నింటినీ తప్పించుకుంటూ వుండేవారని అనేక కథలున్నాయి.
- గొల్లకు గొల్ల, భామకు భామ:
భాగవతుల దశరథ రామయ్య గారు గొల్ల కలాప ప్రదర్శనాల నిర్వహణలో అఖండ ప్రఖ్యాతి పొందిన వారు. బాల్యంలో గొల్ల వేషం; కౌమార దశనుండి యవ్వన దశవరకూ భామ వేషం, ఆ తరువాత భామా కలాపంలో సూత్రధారిగా వుండి గొప్ప ప్రతిష్ఠ పొందారు.
దశరథ రామయ్యగారు ఈ విధంగా కొంతకాలం భామకలాప వ్రదర్శనలో వుండి, తరువాత భూత వైద్యవిద్య కూడ అభ్యసించారు. ఒక సమాజానికి దర్శకత్వం వహించి ఆ బృందాన్ని నడుపుతూ దేశ పర్యటన చేస్తూ వుండే వారట. ఈ యన సకల శాస్త్ర పారంగతుడైన భాగవతుల ల్లక్ష్మీ నారాయణగారికి, భాగవతుల రామనాథ శాస్త్రి గారికి సమకాలికులు. వీరు తమ జట్టులతో దేశ సంచారం చేస్తూ గొప్ప గొప్ప సంస్థానాల కేగి పండిత సభల్లో ప్రదర్శనాలు ఇచ్చి అఖండమైన ఖ్యాతి ఆర్జించారు. ఈ విధంగా వీరు విజయయాత్ర చేస్తూ వుండేవారు. వీరి విద్యా ప్రభావానికి ఆబాల గోపాలం అనందపడుతూ వుండేవారు.
- పండితుల సవాళ్ళు:
ఆ రోజుల్లో కేవలం ప్రదర్శనమిచ్చే మామూలు నటులుగానే గాక, సభాముఖంలో అప్పటికప్పుడు పరీక్షలతో ప్రశ్నించే పండితులకు సమర్థతతో సమాధానం చెప్పి ఎటువంటి పరీక్షల కైనా తట్టుకో కలిగిన పండితులూ సమాజాల్లో __స్త్రీల లోనూ, పురుషులలోనూ _ వుండేవారట.
ఇటువంటి కుటుంబాలు కృష్ణాజిల్లా నంగిగెడ్డ గ్రామంలో అనేకం వుండేవి. గుంటూరు జిల్లాలోని బోడాయి పాలెంలో చిన్న రాణి అనే ఒక నర్తకి ప్రదర్శనాన్ని ప్రసిద్ధ పండితులందరూ మెచ్చుకునేవారట. అలాగే రేపల్లె తాలూకా, ధూళిపూడి గ్రామస్థులు మహంకాళి సీతయ్యగారు, ఒంగోలు తాలూకాలోని తమ్మవరం కాపురస్తుడు తమ్మవరం వేంకటస్వామి మొదలైన వారు ప్రసిద్ధులు.