పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నట్టువనారు పాడే పాటకు అనుగుణంగా ఆభినయం చేస్తుంది. ఇది కేవలం తెలుగు వారు సృష్టించిన నాట్యం.

ఈ ఏకపాత్రాభినయ భరతనాట్యం దాదాపు 150 సంవత్సరాల క్రిందటనే రూపొందింది. తంజావూరు భరతనాట్యం కేవలం తెలుగు వారి సృష్టి. ఇందుకు ఉదాహరణ నాయక రాజులూ, మహారాష్ట్ర రాజుల కాలంలో ఎంచి ఏర్పర్చినట్లు తెలుగు వాగ్గేయ కారులూ, తెలుగు నర్తకీ మణులే ఆస్థానాల్లో ఉండడమే. త్యాగరాజు కీర్తనలు, సారంగ పాణి పదాలు, క్షేత్రయ్య మువ్వ గోపాల పదాలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు మొదలైనవన్నీ మనకు తదితర సాక్ష్యాధారాలు.

సకలకళా సరస్వతి సరస్వతీమహల్:

తెలుగుదేశపు ఈ భరతనాట్యాన్ని తీర్చిదిద్దింది దేవదాసీలూ, రాజనర్తకీ మణులేనని పి.యస్.ఆర్. అప్పారావుగారు నాట్యశాస్త్రంలో వుద్ఘాటించారు.

విజయనగర సామ్రాజ్య వైభవం వెలుగొందినన్ని రోజులూ మన భాగవతులు రాయల వారి ఆస్థానంలోనూ, బహుధా విస్తరించిన ఆయన సామ్రాజ్యంలోనూ ప్రదర్శనలిస్తూ ప్రజా ప్రబోధాన్ని గావించారు. కాని విజయనగర రాజ్య పతనానంతరము కవి గాయకులతో పాటు మన కళాకారులు కూడ విధి లేక వలస వెళ్ళిపోవలసి వచ్చింది.

ఆరోజుల్లో (1581 నుంచి 1614 వరకూ రాజ్యాన్ని పరిపాలించిన ఆంధ్ర రాజులైన అచ్చ్యుతప్ప నాయకుల వారి ఆస్థానంలో వారి ఆదరాభిమానాన్ని పొంది నాట్యకళా సాంప్రదాయలను అభివృద్ధి పరిచారు. తంజావూరు సరస్వతీ మహల్ కవులతోనూ, గాయకులతోనూ, కళాకారులతోనూ అద్వితీయంగా వెలుగొందింది. అచ్యుతప్ప నాయకుల వారు వారి పంచన చేరిన కూచిపూడి బ్రాహ్మణ కుటుంబాల వారందరికీ అగ్రహారాలను దానంగా ఇచ్చారు. అలా దానం చేసిన వాటిలో కూచిపూడి భాగవతులకు దానం చేసిందే అచ్యుతాపుర ఆగ్రహారం. అచ్యుతప్పనాయకుని దానం