పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వన్నెల రవికను తొడిగి, ముంజేతులకూ, ముఖంపైణా పచ్చబొట్లతో, కురుమాపు పైటలో చిన్న బుడుతణ్ణి మూపున కట్టుకొని, తరతరాలనాటి పైడి బుట్ట నెత్తిన బెట్టుకుని, కనుబొమల సందున నామం పెట్టి, నొసట విభూతి పెట్టి, కన్నులకు కాటుక పెట్టేది. దారి కట్టు, మొనకట్టు, కనికట్టు, స్త్రీ వశ్యం కలిగించే తాయిత్తుల్నీ, ఏరుల్నీ అమ్ముకునేది. దీనిని కురవంజి అని కూడ సంబోధించే వారు. ఆనాడు కురవంజి ఆటలు కూడ విరివిగా జరుగుతూ వుండేవి. ఉదాహరణకు యాదవదాసు వ్రాసిన గరుడాచల యక్షగానంలో లక్ష్మీదేవి తెర వెడలిన తరువాత, ఎరుకల నాంచారిని ద్వారపాలకుడు ఈ విధంగా పరిచయం చేశాడు.

తెరవెడలిన నాంచారి:

కం.తరుణిరొ తెరకును వెళ్ళుము
కరుణతో మీ కథలు మాకు కమలదళాక్షి
నరగున జెప్పుము మ్రొక్కుము
ఎరుకల నాంచారుబొమ్మ వెలదిరో రమ్మా॥

అని ఎరుకల నాంచారును ప్రవేశ పెడతాడు.

ఎరుక ఎరుకోయమ్మ - అవ్వోళ్ళయ్య ॥ఎ॥
ఎరుకచే జగమంత - వెలుగుచు నుండును.
మరుక తిరిగేటి మగువను వినవమ్మ ॥ఎ॥
ఏడు కొండలమీద ఎక్కింది ఎరుక.
జోడు గుండ్లమీద కూడిందె ఎరుక ॥ఎ॥

అంటూ ఈ నాంచారు ఒక కీర్తన పాడుతుంది.

 ఎరుక జెప్పితి వినవమ్మా - ఓ ముద్దులగుమ్మా
కరుణతో కలదే కనకపు బొమ్మా ॥
ఎరుకా, ఎరుకా, ఏడు జగములు
మురియుచు నీరీతి ధనముచ్చట జెప్పెద

అంటు వుండగా లక్ష్మీదేవి యెటువలెనో చెప్పవమ్మా' అంటుంది.