పుట:TellakagitaM.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పదాల తోట దడి..


పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా
పూల తావి తాకిన తుమ్మెద ఎద చేసే ఝంకారం
నీ నామజపమైన వేళ

చెదిరే తూనీగల్లా నా భవభావాలు గడికోమాటు బరి దాటుతున్నా..
పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా

నిను వెతికి వెతికి వగచి తలవంచి నిలువలేక
ఈ భావావేశపు గింగిర్లు

జారిపడ్డ ఆలోచనల కంపన కంటి కొలనింట.
కదిలే పిట్టలా కనుచూపు మింటివెంట..
పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా
ఎండిన ఆకులా నా మాట రాలి తేలి నిన్ను చేర ముద్దాడ..
మాట తేరుపై మనసు చేసే ఓ సంధ్యా రాగం మన ప్రణయం
పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా
ఉక్కిరిబిక్కిరిలో కదలాడే కలువనీడలా వణికిస్తున్న నీటి పొర
తడుస్తున్న కనురెప్పలను పొడుస్తున్న వెన్నెల కిరణాల తుంపర

జాలి మనసుతో వేడుతున్నా ..
నీ రాక చూడని కాలాన్ని
నీ మాట వినిపించని రాగాన్ని
యుగాల ఎడబాటుని
నన్నొదిలి వెళ్ళమని
పెదాల పరదాలు తెరదీసి పలువరిస్తున్నా
పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా.. మూస్తున్నా..