పుట:TellakagitaM.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిను చేరాలంతే..

ఎంత కష్టమో నిను చేరాలంటే..
అనుకున్నా వన్నెలాడీ! నిను చేరాలంతే..
నే వచ్చేలోగా నీ తకిట తకదిమి.. ఆగదని..
నిలకడ వదిలిన నీ మునివేళ్ళను మునిమాపు వేళల్లో
సందెపొద్దు సూరీడు ముద్దాడివెళ్లేలోగా
అనుకున్నా కలవిడిచి … ఇలనైనా నిను చేరాలంతే..

శీతల పవనాలు ప్రేరేపించే నాదాలై
పక్షుల కువకువలు స్వరజతులై ఉత్తేజితం చేసే వేళ
నిశీథి వీధుల విషాద ఛాయల్లో నువ్వు విశ్రమించవని
అంబరవీధుల పహారా మాని నీకై నిలవనా!

మేఘాల వీవెనలతో చెమిర్చిన మోహనాన్నే తడమనా!!
మంచుబిందువులు నీ పెదవిపై వాలేలోగా నిను చేరాలంతే..
నీ నర్తనలో తడిసి ముద్దైన నేల నాకు కోనేరే..
మువ్వరాల్చిన మెరుపు రజనునై తానాలాడనా

వలపు వాకిట నీ దరిచేరినా నాకది పూల పన్నీరే
దూరాన చలించే నీపై తపనే తమకమై తరించనా
నిను వారించాలని.. వరించాలని వచ్చా నిను చేరాలంతే..

గుండెలదిరేలా వచ్చా వడివడిగా దడదడగా
వెన్నెలకిరణాల దాడిలో నే ఓడేలోగా
వన్నెల విరిమోము ఆడి-ఆడి వాడేలోగా
నా జీవన ఉఛ్వాస నను వీడే లోగా..
ఏనాటికైనా.. ఎలాగో.. నిను చేరాలంతే..
నా తీరంలా నువ్వు నర్తిస్తుంటే..
మెల్లగ నిను ముద్దాడి నే సేదతీరాలంతే