పుట:TellakagitaM.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పేపరుతో నాన్న

నాన్న అర్థమంతా.. నా చదువుల దీపావళి వెలుగులకే
తన అవగాహనైనా, సంపాదనైనా కాలుతున్న మతాబే
నాకన్నా నా భవితను నిర్వచించేది తన కన్న కష్టార్జితమే;
జ్ఞానమైనా, ధనమైనా అర్థానికున్న సమస్త నానార్థాలకూ
పర్యాయపదం నాన్నే
ఉద్యోగప్రకటనల కాలం కళ్ళ కింద కరిగేది తన రెక్కలలోనే
నాలుగు రుపాయల కాగితాల దొంతరైన పేపరు
ఉద్యోగ సమాచారాన్ని ప్రత్యక్షప్రసారం చేసే పావురాయై
ఆ నాలుగురాళ్ల మనిషి మీదే వాల్తుంది తెల్లారగానే

రెక్కల టపటపల్లా పేపరు రెపరెపల్లో ఎగిరే కళ్ళు తనవే
దాణా తిన్నట్టుగా కాక పిల్లకు పెట్టేటందుకు
పుక్కిట పట్టే ప్రయత్నం
కనబడ్డ ఆశల మెరుపులను తెల్లారే కురిపించాలని
ఉరిమి ఉరిమీ నను తడిపేస్తాడు తడిమేస్తాడు దబాటంగా
ఆవిరైన చమట చుక్కలు ఘనీభవించిన మేఘమై నాన్న నా పైన
గాలాడని వేళలలో వర్ష పాత సూచన అమ్మ భరోసా నా తరుపున
జల్లో జడివానో నా ప్రయత్నం..
గాలివాటు ప్రయాణంలో తీరం దాటుతూ నేను

వానకారు కోయిలై ఫలితాలకోసం
 రాశి-ఫలాల వేటలో..
మళ్లీ పేపరుతో నాన్న
నా కాలం కలిసొచ్చేదాకా కదలని చిత్తరువులా
పేపరుతో
తన మానాన తానే

(ఇంజనీరింగ్ సీటు సంపాదించుకోనప్పటి మాట..
నాకింకా .. గుర్తే)