పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రేకు:0225-06 సాళంగనాటసంపుటము: 03-143
పల్లవి: అంజనాతనయుఁడైన హనుమంతుఁడు
       రంజితపు మతంగపర్వత హనుమంతుఁడు
చ. రాకాసునెల్లాఁ గొట్టి రావణుని భంగపెట్టి
    ఆకాసము మోచెనదే హనుమంతుఁడు
    చేకొని యుంగరమిచ్చి సీతకు సేమము చెప్పె
    భీకర ప్రతాపపు పెద్ద హనుమంతుఁడు
చ. రాముని మెప్పించి మధ్యరాతిరి సంజీవి దెచ్చి
    ఆముకొని యున్నాఁడు హనుమంతుఁడు
    స్వామికార్యమునకే సరిఁ బేరువడ్డవాఁడు
    ప్రేమముతోఁ బూజగొనీఁ బెద్ద హనుమంతుఁడు
చ. ఉదయాస్తశైలముల కొక్కజంగగాఁ జాఁచి
    అదె సూర్యుతోఁ జదివె హనుమంతుఁడు
    యెదుట శ్రీవేంకటేశు కిషుఁడై రామజపానఁ
    బెదవులు గదలించీఁ బెద్ద హనుమంతుఁడు
రేకు:0346-05 మాళవి సంపుటము:04-272
పల్లవి: అంజినీదేవికొడుకు హనుమంతుఁడు
       సంజీవినిదెచ్చినాఁడు సారె హనుమంతుఁడు
చ. కలశాపురముకాడ కదలీవనాల నీఁడ
    అలవాఁడె వున్నవాఁడు హనుమంతుఁడు
    అలరుఁ గొండలకోన లందలిగుహలలోన
    కొలువు సేయించుకొనీఁగోరి హనుమంతుఁడు
చ. పసలుగా జంగవెట్టి పండ్లగుత్తి చేతఁబట్టి
    అసురలనెల్లఁ గొట్టీ హనుమంతుఁడు
    వసుధ బ్రతాపించి వడిఁ దోఁక గదలించి
    దెసలెల్లాఁ బాలించీ దివ్యహనుమంతుఁడు
చ. వుద్దవిడి లంకచోచ్చి వుంగరము సీతకిచ్చి
    అద్దివో రాము మెప్పించె హనుమంతుఁడు
    అద్దుక శ్రీవేంకటేశు కటుబంటై వరమిచ్చి
    కొద్ది మీర సంతోసాలే గుప్పీ హనుమంతుఁడు
రేకు:0020–04 ఆహిరిసంపుటము: 01-122
పల్లవి: అంటఁబారి పట్టుకోరె అమ్మలాల యిదె
       వెంటఁ బారనీదు నన్ను వెడమాయ తురుము
చ. కాఁగెడు పెరుగుచాడె కవ్వముతోఁ బొడిచి
   లేఁగలఁ దోలుకొని అలిగిపోయీని
   రాఁగతనమున వాఁడె రాతిరి నారగించఁడు
   ఆఁగి నన్నుఁ గూడడిగె నయ్యో ఇందాఁకను
చ. కొలఁదిగాని పెరుగు కొసరికొసరి పోరి
   కలవూరుఁ గాయలెల్లఁ గలఁచిపెట్టె
   పలుకఁడు చేతిచట్టి పారవేసి పోయీనదె
   చెలఁగుచు మూఁటగట్టెఁ జెల్లఁబో యిందాఁకను
చ. మట్టుపడ కిటు నూరుమారులైనా నారగించు
    ఇట్టె యిం1దరిలోని నాన్నాళ్ళును
    వెట్టికి నాకొరకుఁగా వేంకటేశుఁ డారగించె
   యెట్టు నేఁ 1డాఁకట ధరియించెనో యిందాఁకను