తెలుగు నవల
7
మొట్టమొదటిసారిగా నవలారచన పోటీ ప్రారంభించింది. ఈ చింతామణి మాస పత్రికను న్యాపతి సుబ్బారావు పంతులుగారు నిర్వహించేవారు. రచనలు ఎన్నిక చేయడం మొదలైన నంపాదకత్వ బాధ్యతను వీరేశలింగమే వహించాడు. తెలుగు సాహిత్యంలో నూత్నరీతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నవలా పోటీలు ఏర్పాటుచేసినట్లు, పత్రిక పేర్కొన్నది. 1893 వ సంవత్సరంలో పోటీకి మూడే నవలలు వచ్చాయి. న్యాపతి సుబ్బారావు, వీరేశలింగం, ఆచంట సుందరరామయ్యగారలు న్యాయమూర్తులుగా వ్యవహరించారు. మొదటి బహుమానం ఖండవల్లి రామచంద్రుడు రచించిన ధర్మవతీ విలాసానికి లభించింది. రెండో బహుమానం తల్లాప్రగడ సూర్యనారాయణరావు రచించిన సంజీవరాయ చరిత్రకు లభించింది. చింతామణి పత్రిక నిర్వహించిన యీ పోటీలవల్ల తెలుగు దేశానికి మహోపకారం జరిగింది. చిలకమర్తి లక్ష్మీనరసింహం నవలారచయితగా ఆవిర్భవించడమే ఆ ఉపకారం. 1894 వ సంవత్సరంలో జరిగిన పోటీలో చిలకమర్తి పాల్గొన్నాడు. ఆ సంవత్సరం ఆయన రచించిన రామచంద్ర విజయానికి ప్రథమ బహుమానం లభించింది. రెండో బహుమానం గోటేటి కనక రాజుగారి వివేకవిజయానికి వచ్చింది. ఎక్కడో గంజాం జిల్లా రసూల్ కొండలో ఎలిమెంటరీ స్కూలు మేష్టరుగా పనిచేస్తున్న ఖండవల్లి రామచంద్రుడు చింతామణి బహుమాన ప్రకటనచే ప్రేరితులై ధర్మవతీ విలాసమనే నవలను పోటీకి పంపి ప్రథమ బహుమతి గెలుచుకోవడం గొప్ప విషయం. చింతామణి నవలా పోటీల వల్ల తెలుగు సాహిత్యంలో నవలా ప్రక్రియ త్వరితగతిని చాలా అభివృద్ధి పొందింది. అంతకు పూర్వం నాటకాలు మాత్రమే రచిస్తూవచ్చిన చిలకమర్తి నవలా రచనపట్ల ప్రేరితుడై పోటీకి నవల పంపించాడు. ఆయన రామచంద్ర విజయానికి ప్రథమ బహుమానం రావటమేకాక, ప్రతిఏడూ ఆయన పోటీలో పాల్గోవడం జరిగింది. చిలకమర్తి పోటికి నవల వ్రాశాడంటే మరెవరికీ ప్రథమ బహుమతి రాదు అనే వాడుక కూడా ఏర్పడింది. చిలకమర్తి అధిక సంఖ్యలో నవలలు వ్రాసి ఆంధ్రస్కాట్ అనే బిరుదు కూడా పొందాడు. ఆయన రచించిన చారిత్రక నవలలు, సాంఘిక నవలలూ బహుళ జనాదరణను పొందాయి. తొలి వాళ్ళ సుప్రసిద్ధ నవలారచయితలలో చిలకమర్తికి సుస్థిరమైన స్థానమున్నది. 1895 వ సంవత్సరంలో ఖండవల్లి రామచంద్రుడు మళ్ళీ పోటీకి నవల పంపించాడు. ఈసారి ఈయనకు రెండో బహుమతి వచ్చింది. ప్రథమ బహుమతి టేకుమళ్ళ రాజగోపాలరావుగారి త్రివిక్రమ విలాసానికి వచ్చింది. 1896 వ