పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

83

రూపాయలు చందా లిచ్చుచుండిరి. ఈ బోగముమేళములు తమతమ పేరులతో వ్యవహరింపఁబడక - నాయఁడుగారిమేళము, - పంతులుగారిమేళము, - శాస్త్రిగారిమేళము, అని పిలువఁబడుచుండెను. ఎవ్వరి యింటనైన శుభకార్యము వచ్చినపక్షమున, ఈప్రముఖులు తమతమమేళములను బెట్టవలసినదని సందేశములను బంపుచుండిరి. పత్రికావిలేఖత్వము పైని బడినందున, ఇట్టిబలవంతుల కప్రియముగా నీదుర్వ్యాపారమునుగూర్చి పలుమాఱు వ్రాయవలసి వచ్చినది. కొన్ని సమయములయం దాప్రముఖులు దురాగ్రహావేశపరవశు లయి పత్రికను గొనవలదని చందాదారులతోఁ జెప్పియు, దూషణోక్తులు పలికియు, నన్నేమో చేసెదమనియు చేయించెదమనియు బెదరించియు, నానావిధముల నన్ను నాపూనికనుండి మరలింపఁ జూచిరి గాని యీశ్వరానుగ్రహమువలన వారికోరికలు సఫలములయినవికావు. ఒక్కటితక్క వేశ్యలపాఠశాలలన్నియు నల్పకాలములోనే తీసివేయఁబడినవి. దురభిమానముచేత నిలుపఁబడిన యా యొక్కపాఠశాలయు వేశ్యలమూలమునఁ దదభిమానికి సంభవించిన యాపద వలన నశించినది. పొరుగూళ్ళనుండి వచ్చినవేశ్యలు తమప్రవాసక్లేశమును విడిచి మరల స్వగ్రామములకుఁ బోయి సుఖింపవలసినవారయిరి. ఇట్లు దుర్బలునిచే నవలంబింపఁబడినదయ్యు ధర్మమే కడపట జయమునొందినను, వేశ్యావలంబులకు నాపయినిగలిగిన కోపముమాత్ర మంతశీఘ్రముగా పోలేదు. అప్పుడు నా కెవ్వరి కోపమును గణనచేయ నక్కఱలేని స్వతంత్రస్థితియం దుండవలె నన్న చింత దృఢఃముగాఁ గలిగెను. ఉపాధ్యాయత్వము సాధారణముగా స్వతంత్రత కలదే యయినను, స్వదేశస్థులు పాఠశాలాకార్యనిర్వాహకులై యున్న ప్పుడదియుఁ బరతంత్రమైనదనియే నాకభిప్రాయము కలిగెను. అందుచేత నుపాధ్యాయత్వమును సహితము విడిచి, పత్రికను నిర్వహించుచు గ్రంథకర్తనయి స్వతంత్రుఁడను గావలెనన్న బుద్ధి నాకప్పు డుదయించెను.

పత్రికాధిపత్యమువలన స్వతంత్రజీవనము చేయఁదగినంత ధనాగమము కలుగునని నా కెప్పుడును నమ్మకములేదు. నాగ్రంథములను పత్రికావిలేఖకులు