పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

స్వీయ చరిత్రము.

బోగముచానల నాశ్రయించినవారినే గారవించుచుండుటచేత నాధనికుల యనుగ్రహము నపేక్షించి వారివలన బాగుపడఁ దలఁచి యాశ్రయించుచున్న వారందఱును ఆచెడుపడఁతుకలయడుగులకు మడుగు లొత్త వలసినవారు గా నున్నారు." - ఈవ్రాఁత యిప్పుడు కొందఱి కతిశయోక్తిగా తోఁచవచ్చునేమో కాని యప్పు డది మారాజమహేంద్రవర విషయమున స్వభావోక్తి యనుట కణుమాత్రమును సందేహము లేదు. అప్పటి వేశ్యావలంబులగు మహాపురుషుల నిచ్చటఁ బేర్కొనుట యనావశ్యకము. అప్పుడు న్యాయాధిపత్యము మొదలగు మహోన్నతపదములయం దున్న మనవా రందఱు నించుమించుగా వేశ్యాదర పరాయణులయి యుండిరని చెప్పుటయే మనప్రస్తుతాంశమునకుఁ జాలియుండును. లౌక్యాధికారధురీణులయి యున్న వారితో పనిలేనివా రెవ్వరోకాని యుండరు. ఆయధికారులయిండ్లకు స్వకార్యార్థము పోయినప్పుడు వేశ్యల నుంచుకొన్నవారి కెక్కువ గౌరవము ; ఉంచుకోనివారికి తక్కువ గౌరవము. న్యాయసభలలో సహితము వారకాంతావల్లభులైన న్యాయవాదులవాదమునం దాదరము ; కేవలకులకాంతావల్లభులైన న్యాయవాదుల వాదమునం దనాదరము. అందుచేత ప్రభుసమ్మానముచే ధనార్జనముచేయ నపేక్షించిన న్యాయవాదు లనేకులు వేశ్యలను జేరఁ దీయవలసినవారయిరి. కొన్ని సమయములయం దీయధికారులే శ్లాఘనపూర్వకముగా నొక్కొక్క వేశ్య నొక్కొక్క న్యాయవాది కనుగ్రహించుచు వచ్చిరి. అందుచత మారాజమహేంద్రవరములోనున్న వేశ్యలు చాలకపోఁగా, పడపుపడఁతులకయి ప్రసిద్ధి పడసిన రామచంద్రపురము మొదలైనగ్రామములనుండి క్రొత్తవేశ్యలు రప్పింపఁ బడిరి. ఆకాలమునందు రాజమహేంద్రవరములో పాఠశాల యనఁగా వేశ్యల చదువుకూట మనియే యర్థము. వేశ్యలనృత్తగీతాదులకై పెట్టింపఁబడిన పాఠశాల లప్పు డాపురమునం దెన్నియోయుండెను. వేదపాఠశాలలకును శాస్త్రపాఠశాలలకును చిల్లిగవ్వ యియ్య నొల్లని శుద్ధశ్రోత్రియులు సహిత మధికారుల మెప్పునకయి యీ వేశ్యలపాఠశాలలకు నెల కయిదులు పదులు