పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

స్వీయ చరిత్రము.

మొదలైనవారు శ్లాఘించుచు వచ్చుటచేతను, నేను రచించినపుస్తకములను బహుపాఠశాలలలో పాఠపుస్తకములనుగాఁ బెట్టుటచేతను, గ్రంథకర్తృత్వము వలన స్వతంత్రజీవనోపాయము కలుగు నన్నధైర్యము కలిగినది. నావ్యాకరణమువలన రెండుమూడుమాసములలో నిన్నూఱు రూపాయలు వచ్చినవి; నా నీతిచంద్రికవిగ్రహతంత్రమువలన వేయిరూపాయలు వచ్చినవి. అయినను పత్రికను విడువ వలెనన్న బుద్ధి నా కెప్పుడును పుట్టలేదు. పత్రికా ప్రకటనమునకును గ్రంథముద్రణమునకును వలయు ముద్రాయంత్రమును నెలకొల్పవలయు నన్న యభిలాషము నాకు విశేషముగానుండెను. నామిత్రులైన చల్లపల్లి బాపయ్యపంతులుగారును నేనును గలిసి నూఱేసిరూపాయలచొప్పున భాగము లేర్పఱిచి ముద్రాయంత్రమును దెప్పింపవలె నని ప్రయత్నించి ప్రకటన పత్రికలను ముద్రింపించి ప్రచురించితిమికాని భాగస్థులు తగినంతమంది చేర లేదు. ధవళేశ్వరములో నుండఁగా మున్నూటయేఁబదేసి రూపాయలచొప్పున నాఱుభాగములు వేసికొని ముద్రాయంత్రమును రాజమహేంద్రవరమునఁ బ్రతిష్ఠింపవలెనని మరలఁ బ్రయత్నించితిమి. ఈప్రయత్నము నామిత్రు లైన చల్లపల్లి రంగయ్యపంతులవారి ప్రోత్సాహమువలన నెఱ వేఱినది. అందులో నే నొక భాగస్థుఁడనయి నాసహపాఠియు మిత్రుఁడును లక్కవరపు సంస్థానాధిపతియు నైన శ్రీరాజామంత్రిప్రగడ దుర్గామల్లికార్జున ప్రసాదరావులబహదరుగారి నొకభాగస్థునిగాఁ జేర్చితిని. రంగయ్యపంతులుగారు తమయన్న గారైన రామబ్రహ్మముగారిని, సరిపల్లె గోపాలకృష్ణమ్మ గారిని, నాళము కామరాజు గారిని, పందిరి మహాదేవుఁడుగారిని, భాగస్థులనుగాఁ జేర్చిరి ఇట్లు భాగస్థులేర్పడినతరువాత వేసవికాలపు సెలవులలో నేనొకసారి చెన్న పట్టణమునకుఁ బోయితిని. నేను నీతిచంద్రిక విగ్రహతంత్రమును రచించుటచేత మిక్కిలి సంతుష్టులైన శ్రీమాన్ బహుజనపల్లి సీతారామాచార్యులవారు మొదలైన పండితులు నన్ను మిక్కిలి యాదరించి, నాకయిన వ్యయముల నన్నిటిని దామే భరించి, ఒకనాఁడు సభచేసి నాఛాయాప్రతిమను దీయించి నా కొక