పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

స్వీయ చరిత్రము.

                నోపిక సర్వజనోపయుక్తములైన
                        విషయమ్ములును నీతివిషయములును !

                సులభశైలి నందఱకును దెలియునట్లు
                కఠినసంధులు లోనుగాఁ గలవి విడిచి !
                వ్రాయుదు నొకప్పు డన్యదేశీయములును
                లోనుగాఁ గలవానినిఁ బూనికూ ర్తు.

ఈపత్రికాప్రకటనమునందు నాయుద్దేశములు భాషాభివృద్ధియు దేశాభివృద్ధియు ముఖ్యముగా రెండు. నే నేర్పఱచుకొన్న భాషాభివృద్ధి మార్గము తెలుఁగుభాషలో మృదువైన సులభశైలిని సలక్షణమైన వచనరచన చేయుట; దేశాభివృద్ధిమార్గము జనులలోఁగల దురాచారదుర్వర్తనములఁ బాపియు వృద్ధి పద్ధతులను జూపియు వారి నధిక నీతిమంతులను గాఁజేసి దేశము నున్నతస్థితికిఁ దెచ్చుటకయి శక్తివంచన లేక పాటుపడుట. దేశాభివృద్ధి కలుగుటకయి విద్యా విషయమునను, వ్యవహారవిషయమునను, కులాచార విషయమునను, నీతి విషయమునను, మతవిషయమునను నానాముఖములఁ గృషి చేయవలయుననియేకాని యొక్క రాజ్యాంగవిషయములయందే పనిచేయుట నాయుద్దేశము కాదు. మానవదేహములోని కరచరణాదిసమస్తావయవములును యథా ప్రమాణముగా పెరుగుటయే వృద్ధికాని యొక్కతలయో కాలో యత్యధికముగా పెరుగుట వృద్ధికాక రోగమయినట్లే దేశవిషయములోఁ గూడ జనులు నీతిమతకులాచారాదులైన సమస్తాంగములయందును సమానముగా నభ్యున్నతి నొందుటయే వృద్ధిగాని యితరాంగములకు భంగము కలుగునట్లుగా నొక్క రాజ్యాంగముల యందేగాని యొక్క బుద్ధిప్రచారమునందే గాని యుత్కర్షము నొందుట క్షేమకరమైన దేశాభివృద్ధికాదని నాయభిప్రాయము రాజ్యాంగవిషయమున నెక్కడనో దూరమున నున్న పరిపాలకులను వారిశాసనములను దూషించుటకంటె సమీపముననుండి రాజశాసనములను నడుపువారి దోషములను వెల్లడిచేయుట యథికప్రయోజనకరమని నానమ్మకము. దొరతనమువారికిఁ జెల్లింపవలసిన నేల