పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

71

వత్సరము ఆశ్వయుజమాసము నుండి "వివేకవర్ధని" అను నామముతో నాలుగు పెద్దపుటలు గలయొక చిన్న మాసపత్రికను తెలుఁగునఁ బ్రకటింప నారంభించితిని. ఆకాలమునందు మా గోదావరి మండలములో దొరతనమువారిది తక్క వేఱు ముద్రాయంత్రము లేకపోవుటచేత నాపత్రిక నప్పుడు చెన్న పురిలో బ్రహ్మశ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులవారి సంజీవ నీముద్రాక్షరశాల యందు ముద్రింపింప నారంభించి, అక్కడ యుక్తకాలమునందు పత్రిక వెలువడకపోవుటచేత మూడుమాసము లైనతరువాత శ్రీధరముద్రాక్షరశాలకు మార్చి పత్రికను ద్విగుణముచేసి 17 పుటలు గలపుస్తకరూపమునఁ బ్రకటింప మొదలు పెట్టితిని. మాపత్రికాముఖమునకు తిలకముగాను పత్రికానిర్వహణమునందు మాకు మార్గప్రదశ్శకముగాను ఉండుటకయి,

            క. ఒరు లేయని యొనరించిన, నరవర యప్రియము తనమనంబున కగుఁ దా
               నొరులకు నవి సేయకునికి, పరాయణము పరమధర్మపదముల కెల్లన్.

అను భారతనీతివాక్యరత్నమును మేము మాకు మూలసూత్రమునుగాఁ గై కొంటిమి. మాపత్రికయొక్క నామధేయమువలనను మేము గైకొన్న పురస్కృత వాక్యమువలనను మా పత్రికోద్దేశ మెల్లరకుఁ దెల్లము కాఁదగి యున్నను, చతుర్థమాస పత్రికాదియందు నన్నుఁ గూర్చియు నాపత్రికనుగూర్చియుఁ బ్రకటించుకొన్న పద్యమువలన మఱింత స్పష్టమగునని దాని నిందు క్రిందఁ బొందు పఱుచుచున్నాను.

            సీ. బ్రాహ్మణుండను హూణభాష నేరిచి యందు
                          నేఁ బ్రవేశపరీక్ష నిచ్చి నాఁడ !
               నాంధ్రముననొకింత యభిరుచిగలవాఁడ
                          దేశాభివృద్ధికై లేశమైన !
               బ్రాలుమాలక పాటుపడ నిచ్ఛఁగలవాఁడఁ
                          గవితాపటిమఁ గొంత గలుగువాఁడ !