పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

73

పన్నుల మొత్తమునకంటె నీ రిచ్చెడు రాజపురుషుల కియ్యవలసిన లంచముల మొత్త మెక్కువయినప్పుడు నేలపన్ను కొంచెము తగ్గింపఁబడిన మాత్రముననే కాపుల కేమి మేలిమి కలుగఁబోవును ? వ్యాజ్యపు మొత్తమునకంటె న్యాయాధిపతికి సమర్పింపవలసిన యుపాయనమే యధికమయినప్పుడు వాది యభియోగపత్రమునకుఁ బెట్టవలసిన ముద్రకాగితముల మూల్యపరిమితి తగ్గింపఁబడిన మాత్రముననే గెలుపొందియు నతఁడేమి లాభ మనుభవింపఁ గలుగును ? చేసిన యపరాధమునకయి శిక్షాస్మృతినిబట్టి కట్టవలసిన ధనదండనమునకంటె దోషిని దండింపక విడుచుటకును నిర్దోషిని దండించుటకును దండవిధాయి స్వీకరించెడు ముడుపే యెక్కువయినప్పుడు దండశాసనములయందు మంచిమార్పులు కలిగింపఁబడిన మాత్రముననే నూనప్రాణరక్షణము కలవారయి ప్రజలెట్టు సుఖమనుభవింపఁ గలుగుదురు ? ఆకాలమునందు రాజకీయోద్యోగులలో లంచములు పుచ్చుకొనుట సర్వసాధారణము ; పుచ్చుకొను కుండుట మృగ్యము. లంచము తప్పుగాక యుద్యోగధర్మమనియె యెల్లవారినమ్మకము. కాఁబట్టి రాజకీయొద్యోగులలోని యీ యక్రమమును మాన్పఁ బూనుట మా పత్రికోద్దేశములలో నొకటి. లంచము లిచ్చెడు ప్రజలలోను పుచ్చుకొనెడి యధికారులలోను నీతిగౌరవము వర్ధిల్లక లంచము లడఁగవు. కాఁబట్టి జనులలో నీతి మానమును వృద్ధిచేయుట యింకొక యుద్దేశము. వేశ్యాగమవాదులు దురాచారము లని కులములో భావింపఁబడకుండునంతవఱకు నీతి యెట్లు తలయెత్తి వర్ధిల్లఁ గలుగును ? కాఁబట్టి కులాచారములను చక్కఁబఱుపఁ బూనుట మఱియొకయుద్దేశము. తులసీ రుద్రాక్షమాలాది బాహ్య చిహ్న ధారణమునకంటె సత్ప్రవర్తనము మతమున కధికావశ్యకమని జనులలో విశ్వాసము కుదురువఱకును మతము పరిశుద్ధమయి దురాచారనివారకము కానేరదు. కాఁబట్టి పరిశుద్ధమత సిద్ధాంతములను బోధించుట వేఱొకయుద్దేశము. ఇట్టిసదుద్దేశములతో మావివేకవర్ధని మొదటవెలువడినది. ఆస్తిక్యము, వివేకము, సత్యము, అహింస, మొదలైనవియే మొదటిపత్రికలయందు వెలువడిన యుపన్యాసములు.