పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

స్వీయ చరిత్రము.

పట్టించి యాయోగీశ్వరుని వీధిలోనికి గెంటించితిని. అతఁడు దండతాడితభుజంగమువలె రోఁజుచు, నన్ను శపించుచు, ఏమి చేసెదనో రేపీ వేళకు చూడుమని బెదరించుచు, వేఱొకచోటికిఁ బోయెను. అట్లు పోయి యతఁ డొక యింట నొకగది పుచ్చుకొని యలికి మ్రుగ్గుపెట్టి యం దేదోయంత్రము వేసి, ప్రయోగముచేసి నన్ను చంపెదనని పలుకుచు, స్నానముచేసి తలవిరయఁబోసికొనివచ్చి యుపవాసముతోఁ గూర్చుండి నిష్ఠాపరుఁడై యేదోమంత్రజపము చేయనారంభించెను. అది చూచి, నామిత్రులు భయపడి నాయొద్దకు వచ్చి, అట్టియభిచారవేత్తతో తగవులాడుట క్షేమకరము కాదనియు, తమమాట విని యాతనిపాదములమీఁదఁ బడి వేఁడికొని చేసిన యపచారమునకై క్షమార్పణము చేయవలసినదనియు, నాకు హితము చెప్పిరి. వా రెన్ని విధములఁ జెప్పినను వారిమాటలు వినక, ఆమూఢుఁడు నన్నేమి చేయఁగలఁడో చూతమని చెప్పి, వచ్చినవారిని వచ్చినట్టే పంపి వేసితిని. ఆయోగి రాత్రివఱకును భోజనములేక కొబ్బరికాయలనీళ్లు త్రాగి యట్టే యుండి యొంటిగా చీఁకటిలో "హ్రీం" "హ్రాం" అని కేకలు వేయుచుండెను. అతఁ డర్థరాత్రముదాఁక నట్లే యుండి యాహారము లేకపోవుటచేతనో నారికేళజలము పైత్యము చేయుట చేతనో నిద్రమత్తుచేతనో గంజాయిమైకముచేతనో మఱి యేహేతువుచేతనో తూలి క్రిందఁ బడిపోయి, తన్నెవ్వరో త్రోచిపడవేసినట్టు భ్రమించి జడిసికొనెను; భీతిచేత నాతనికి వెంటనే భయజ్వరము వచ్చెను. ఒకరిని జడిపింపఁ బోయి తానే జడిసికొన్నట్లు మఱునాటి ప్రాతఃకాలమునఁ దన్నుఁ జూడవచ్చినవారితో నెల్లను నేను శరభసాళ్వమును దనమీఁధఁబ్రయోగము చేసితి ననియు, ఆదేవత వచ్చి తాను బంపుచుండిన దేవతనెత్తి యడఁచి తన్నుఁ గ్రిందఁ బడవేసె ననియు, ఆదేవత తన్ను శీఘ్రముగానే చంపు ననియు, ఆయోగి చెప్పసాగెను. నాకు మంత్రమహిమయందలి విశ్వాసము పోయినతరువాతనే నాతల్లియొక్కభ్రమను నివారించునిమిత్తమయి నేను శరభసాళ్వ మంత్రము నుపదేశ మయితిని. ఆసంగతి నంతకుఁ బూర్వమే యాయోగి విని