పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

65

కలుగలేదు. అట్టిభ్రమకలిగినప్పుడు తన్ని వారణార్థమై భూతవైద్యుఁ డను వాని నెవ్వనినో పిలిపించి తత్కాలమున కేదో తంత్రము చేయించుచు వచ్చినంగాని కార్యము లేకుండెను. కోరంగిలోనున్న కాలములో సహితము నా మాత కట్టిభ్రమము కలుగుచు నేవచ్చెను. అక్కడివారు గొప్పభూతవైద్యుఁడని నాయొద్ద కొకయోగిని గొనివచ్చిరి. ఆ బ్రాహ్మణయోగి మిక్కిలి కండపుష్టి గలవాఁడు; పూటకు సేరుబియ్యపు అన్నమునకు తక్కువ కాకుండ తినెడువాఁడు; గడ్డమును గోళ్ళును బెంచినవాఁడు. కాలికి కఱ్ఱపావలు తొడిగి, చేత బెత్తమునుబట్టి, కాషాయవస్త్రములనుగట్టి, నొసట గొప్పకుంకుము బొట్టుపెట్టి, చూచుటకు మహాభయంకరముగా నుండెడివాఁడు; గంజాయి త్రాగెడువాఁడు; ముప్పదికిని నలువదికిని నడిమిప్రాయముగల యాపురుషుని నావద్దకుఁ గొనివచ్చినప్పుడు నాకు మంత్రములయందుఁ గాని దయ్యములయందుఁగాని నమ్మకము లేకపోయినను, నే నాతని మాయింట నుంచుకొని భోజనము పెట్టెదననియు, నాతల్లిదేహము స్వస్థపడినతరువాత మంచి బహుమానము చేసెదననియు, చెప్పితిని. ఆతఁ డందున కొప్పుకొని మాయింటఁ బ్రవేశించెను. ప్రవేశించినది మొదలుకొని యతఁడు 'మే' మని స్వవిషయమున బహువచనప్రయోగము చేసికొనుచు, 'నీ' వని యితరులవిషయమున నేకవచనప్రయోగము చేయుచు, గర్వము చూపఁ దొడఁగెను. నేను దాని కోర్చుకొని యాతఁ డడిగినదాని నెల్ల స్వల్పమగుటచేత నిచ్చుచువచ్చితిని. అందుపైని నేను దనకులోఁబడితి ననుకొని యంతకంత కత్యాశాపరుఁడయి యతఁడు పెక్కు మిషల మీఁద నావద్దనుండి ధనము లాగఁజూచెను. నాతల్లిశరీరము స్వస్థపడినపిమ్మటఁ గాని నేనేమియు నియ్యనని నిరాకరించితిని. అప్పుడతను కన్ను లెఱ్ఱ చేసి నావంక క్రూరదృష్టితోఁ జూచెను. నేను భయపడక యాతనియవివేకమును తలఁచినప్పుడు నవ్వు రాఁగా పకపకనవ్వితిని. అందుమీఁద నతఁడు మఱింత రోషము వచ్చినవాఁడయి కాఱులు ప్రేల నారంభించెను. అప్పుడు నేనును పట్టరాని కోపము గలవాఁడనయి చేరువనున్న మాపాఠశాలభటునిచేత మెడ