పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

67

యుండి యిట్లు బ్రమసియుండును. నేను రెండుదినము లుపేక్షించి యూరకుంటినిగాని యతఁ డంతకంతకు బలహీనుఁడయి సంధిలో నన్నే పలవరించు చుండినట్టు విని జాలినొంది, ఆతనిభ్రమ పోఁగొట్టుటకయి యాతనియొద్దకుఁ బోయి నే నేమియుఁ జేయలేదని నమ్మఁ బలికి ధైర్యము చెప్పి, ఆతనిని మా యింటికిఁ గొనివచ్చితిని. ఈ నాలుగుదినములలోనే యేనుఁగువంటి వాఁడు పీనుఁగువంటివాఁ డయి యా దయ్యాలపోతుబ్రాహ్మణుఁడు మాయింటికి వచ్చిననాఁ డరసోలెడుబియ్యపు అన్నమునైనను తినలేకపోయెను. క్రమక్రమముగా నన్న హితము కలిగి యతఁడు యథాస్థితికి వచ్చుటకు నెలదినములు పట్టినది. తమమంత్రములయందు పటిమ లేదని యెఱిఁగి ధనార్జనమునకయి మాయ వేషములు వేసి పరులను మోసపుచ్చుచుండువారు సహిత మితరుల మంత్రముల యందు పాటవము కలదని నమ్ముచుందురు. అతఁడు పూర్ణముగా స్వస్థపడిన తరువాత నాతని కొక క్రొత్తబట్ట కట్టఁబెట్టి యొకరూపయ రొక్కమిచ్చి పంపి వేసితిని. శరభసాళ్వమంత్రము నెఱుఁగ నపేక్షించువారు నారాజశేఖర చరిత్రమునందుఁ జూడవచ్చును.

1874 వ సంవత్సరమునం దాషాడమాసమున నేను కోరంగిలోని పనిని విడిచి, నాస్వస్థలమగు రాజమహేంద్రవరమునకు నాలుగుమైళ్ల దూరములో నున్న ధవళేశ్వరమునందలి యాంగ్లోదేశభాషాపాఠశాలలో నెలకు రు 44-0-0 ల జీతము గల ప్రధానోపాధ్యాయత్వమునందుఁ బ్రవేశించితిని. ఇక్కడ నున్న కాలములో సహితము బ్రహ్మశ్రీ - కొక్కొండ వేంకటరత్నము పంతులవారును వారిపక్షమువారును స్త్రీవిద్యానిషేధవాదులయి, స్త్రీల విద్యకుఁ బ్రతికూలముగా నాంధ్రభాషాసంజీవనిలో వ్రాయుచుండఁగా, నేను వారికిఁ బ్రతిపక్షమును బూని స్త్రీవిద్యావిధాయకవాది నయి వారివాదమును ఖండించుచు స్త్రీలవిద్య కనుకూలముగాఁ బురుషార్థప్రదాయినికి వ్రాయుచుంటిని. ఈ వాదప్రతివాదములలో నాయుత్తరములను గొన్నిటిని పద్యరూపమునసహితము వ్రాసితిని. అప్పటి నాపద్యము లెట్లుండునో తెలియుటకయి యొక లేఖ నుండి కొన్ని పద్యముల నిం దుదాహరించుచున్నాను. -