పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

61

యులుగా నుండిరి. అందుచేత తక్కినయుపాధ్యాయు లాయనతమ్ముఁ డొకవేళ తమతరగతిలో నల్లరి చేసినను చూచి చూడనట్లు పేక్షించి యూర కుండెడివారు. ఒకనాఁడు కృష్ణమూర్తిపంతులుగారు నాలవతరగతి నాయొద్దనున్నప్పు డేదో కొంచెమవిధేయతను గనఁబఱుపఁగా, నేనించుకయు సందేహింపక తత్క్షణమే యాయనను బల్లపై నెక్కించి నిలువఁబెట్టితిని. నాలుగైదు నిమిషములైనతరువాత నాతోడి యుపాధ్యాయుఁ డొకఁడు నావద్దకు వచ్చి, రహస్యమని చెప్పి నన్నావలికిఁ గొనిపోయి "యాచిన్నవాఁడు రామమూర్తి పంతులుగారి తమ్ము"డని చెప్పెను. "అవును. నేనెఱుఁగుదును" అని చెప్పి యచట నిలువక నాతరగతిలోనికి వచ్చితిని. నామిత్రుఁ డూహించినట్లుఁగా రామమూర్తిపంతులుగారు నాపైని కోపపడక, సాయంకాల మైదుగంటలకు పాఠశాల విడిచిపెట్టఁగానే నాయొద్దకువచ్చి, తనతమ్ముఁడని మోమోటపడక స్వకృత్యమును నిర్వహించినందులకు నన్నభినందించి తమకృతజ్ఞతను దెలిపిరి. శిక్షితులైన కృష్ణమూర్తిపంతులుగారు సహితము నాపైని గినుకపూనక యాదరము నే కలిగియుండిరనుటకు 1876వ సంవత్సరమునందు చెన్న పురి రాజకీయ శాస్త్రపాఠశాల (ప్రెసిడెన్సీ కాలేజి)లో ప్రథమశాస్త్రపరీక్షతరగతిలో చదువు కొనుచు చిరకాలమునకు తమంత నాపేరవ్రాసిన లేఖలో "భగవత్కృపచేత మీ రస్థిభారము వేసిన యల్పజ్ఞానమువలననే నే నీసంవత్సరము ప్రథమశాస్త్ర పరీక్షలోఁ దేఱవచ్చును. నాజీవితకాలములో మిమ్మెప్పుడును గౌరవింపకుండఁ జాలను" [1] అనునర్థము వచ్చునట్లు వ్రాయుటయే సాక్ష్యముగానున్నది. ఈ వఱకుఁ జెప్పినట్లు న్యాయసభలలో కొలువు కుదురఁగూడదని నేను శపథము చేసికొన్న తరువాత, సేవకవృత్తిలేక స్వతంత్రుఁడనుగా నుండవచ్చునన్న యా

  1. " I am doing well in the College and may, by God's grace, expect to pass F.A. this year with the little bit of Knowledge I have, of which the foundation stone was laid by you whom I cannot but honour in my life." - Letter dated 23rd June 1876, Madras.