పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

స్వీయ చరిత్రము.

మూడవ ప్రకరణము.

ఉపాధ్యాయత్వ పత్రికావిలేఖకత్వప్రథమదశ.

క్రీస్తుశకము 1870 మొదలుకొని 1880 వ సంవత్సరమువఱకు.

బారోదొరగారు రోగపడి 1870వ సంవత్సరాంతమున రాజమహేంద్రవరమునుండి తమ ప్రధానోపాధ్యాయత్వమును కల్లికోటయందలి రాజకీయ పాఠశాలకు మార్చుకొని వెడలిపోయిరి. 1871వ సంవత్స రారంభమున ప్రథమశాస్త్ర పరీక్షతరగతి పెట్టఁబడినందున నేనందుఁ జేరి నాలుగైదుదినము లుంటినిగాని యింతలో బారోదొరగారికి బదులుగా కళ్లికోటనుండి వచ్చుచుండిన దొరగారు దారిలో స్వర్గస్థు లగుటచేత రాజమహేంద్రవరమునఁ బ్రథమశాస్త్రపరీక్షతరగతి యెత్తివేయఁబడెను. ప్రవేశపరీక్షయందుఁ గృతార్థుఁడ నైన కొన్ని నెలలలోనే 1871వ సంవత్సరము చైత్రమాసములో కాఁబోలును నేను రాజమహేంద్రవరమునందలి దొరతనమువారి మండలపాఠశాలలో నప్పటి ప్రధానోపాధ్యాయులయిన కుప్పుస్వామి శాస్త్రులవారి సాయమువలన నెల కిరువదియైదురూపాయల జీతముమీఁద సహాయోపాధ్యాయుఁడనుగా నియమింపఁబడితిని. అల్పకాలికమైన యాపని సంవత్సరకాల ముండి నిలిచిపోయినది. పనిలో నున్న కాలములో నేను గొన్ని తరగతుల కింగ్లీషును లెక్కలును హిందూదేశ చరిత్రమును చెప్పుచుండెడివాఁడను. ఆకాలమునందు సహితము నాయెడల విద్యార్థులకు భయభక్తులును సహోపాధ్యాయులకు గౌరవము నుండెను. నేను బాలురను నీతివర్తనమునందు ప్రోత్సాహపఱుచుచు, ఎవ్వరి విషయమునను పక్షపాతము చూపక, సమబుద్ధితో వర్తించుచుండెడివాఁడను. ఏలూరి లక్ష్మీనరసింహముగారు, దురిసేటి శేషగిరిరావు పంతులుగారు, వేపా కృష్ణమూర్తి పంతులుగారు మొదలయినవా రప్పుడు నాలవతరగతిలో నా వద్ద చదువుకొనుచుండెడివారు. ఇందలి కడపటివారి యన్న గా రయిన వేపా రామమూర్తి పంతులుగా రాకాలములో మాపాఠశాలలో ద్వితీయోపా ధ్యా