పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

స్వీయ చరిత్రము.

శతో నాకు న్యాయవాదియై పనిచేయవలెనని కోరికయుండెడిది. అందుచేత నేను దానికిఁ గావలసిన పరీక్షలకుఁ జదువ యత్నించితిని. మండలపాఠశాలలో నాతో సహోపాధ్యాయుఁడును బాల్యములో నాసహాధ్యాయియు మా బంధువును నగు చల్లపల్లి బాపయ్యపంతులుగారు నాకు పరమమిత్రుఁడుగా నుండెను. పాఠశాలలో నుపాధ్యాయులుగానున్న కాలములో మే మిరువురమును గలసి విశేషపరీక్షలకుఁ జదువ నారంభించితిమి. 1871వ సంవత్సరము శ్రావణమాసములో జరగిన దండశాసనోన్నతపదపరీక్ష (Criminal, Higher Grade)కు మే మిరువురమును బోయితిమి. మేమాపరీక్షలో లబ్ధ విజయులమైనట్టు మఱుసటి సంవత్సరమునం దనఁగా 1872వ సంవత్సరమున్ రాజకీయ వ్యవహారపత్రికయందుఁ బ్రకటింపఁబడినది.

ఈకాలమునాటికి నాపూర్వవిశ్వాసములు కొన్ని మార్పు చెందుచుండినట్టు చెప్పియుంటినిగదా. దయ్యములు పట్టినవన్న వారియిండ్లకుఁ దఱుచుగాఁబోయి వారిచేష్టలను నటనలను లక్షణములను పరీక్షించుచుండుటచేతను మంత్రవేత్తల మనువారు చేయుకుతంత్రములను మాయలను శోధించుచుండుటచేతను భూతావేశమునందు నాకు నమ్మకముపోయినది. ఈకాలమునందు జ్యోతిశ్శాస్త్రములోని ముహూర్తజాతకభాగములయందును, శకునములు మొదలైనవానియం దునుగూడ నాకు విశ్వాసము పూర్ణముగా చెడినది. నమ్మకములేనివానిని పామరుల సంతుష్టికై నమ్మినట్లు నటించి యాచరించుచుండుట సాధారణముగా నాస్వభావమునకు సరిపడదు. విశ్వాసములేని దానియందు విశ్వాసములేనట్టు చెప్పుటయు, ఆవిశ్వాసరాహిత్యమును మాటలచేతనేగాక చేష్టలయందును జూపుటయు, నాకు స్వాభావికము. నాయవిశ్వాసమును లోకమునకుఁ జూపుటకును నాకవకాశము శీఘ్రముగానే కలిగినది. మాదొడ్డిలోనున్న యరఁటి చెట్టొకటి యే హేతువుచేతనో కొననుండివేయక నడుమనుండి చీల్చుకొని పువ్వుపైకివచ్చి గెలవేసినది. ఇట్లు చెట్టుమధ్యనుండి గెలవేయుట యరిష్టసూచక మనియు, వెంటనే చెట్టు కొట్టివేయవలసినదనియు, ఇరుగుపొరుగులవారును