పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

స్వీయ చరిత్రము.

వును. స్థిరపడినతరువాత వానిని మార్చుకొనుట బహుతర ప్రయాససాధ్యము గాని సుసాధ్యము కాదు. సామాన్యముగా సుగుణదుర్గుణములు మనసహావాసులైన మిత్రులనుబట్టి యలవడును. కాఁబట్టి యాకాలమునందు మిగుల జాగరూకులమయి శక్యమయినంతవఱకు సన్మిత్రసంపాదనమునకయి ప్రయత్నింప వలయును. ఈవిషయమయి స్వానుభవము నొక్కింత చెప్పెదను. మా బంధువులే యొకరు మాయింట కాపుర ముండెడివారు. ఆకుటుంబ యజమానున కించుమించుగా నాయీడే గల యొకకుమారుఁ డుండెను. ఇరువురమును పదునెనిమిదేండ్లు ప్రాయము గలవార మగుటచేతను, ఏకగృహముననే సర్వదా యుండెడివార మగుటచేతను, బంధుత్వసంబంధము గలవార మగుటచేతను మే మొండొరులతో మైత్రి గల వారమయి యుంటిమి. వినోదమునకయి యప్పుడప్పుడు మే మిరువురమును చీట్లాడుచుండెడివారము. శైశవమునుండియు నేను దుర్బలశరీరుఁడ నగుటచేత దేహాయాస కరములయిన యాటలపొంతఁ బోవక, చీట్లు, దశావతారి, చదరంగము, మొదలయిన కాయకష్ట మక్కఱలేని యాటలతో విరామముగల యప్పుడు ప్రొద్దు పుచ్చు చుండెడివాఁడను. ఆయాటలయం దప్పుడు నేను గొంత నేర్పరి నయియు నుంటిని. నామిత్రుఁడును నేనును మొట్టమొదట పందెము లేకయే చీట్లాడుచుండినను, తరువాత ప్రప్రధమమున చింతగింజలును తదనంతరమున గవ్వలును బెట్టి యాడఁ జొచ్చితిమి. అప్పుడు పదునాఱుగవ్వలవెల యొకదమ్మిడీకి సమానముగా నుండెను; గవ్వలిచ్చి యప్పు డంగడిలో నేవస్తువునైనను గొనవచ్చును. ఏదుర్వృప్తియైన నారంభము కాకయే యుండవలెనుగాని కొంచె మారంభమైనతరువాత ముందుకు సాగక యారంభించిన చోటనే నిలువదు. నామిత్రుని ప్రోత్సాహము చేత గవ్వలు దమ్మిడీలయినవి; దమ్మిడీలు డబ్బులయినవి. నేను సాధారణముగా నోడిపోయెడివాఁడను గాకపోయినను, వేడుక కొఱకే యారంభమయిన మాచీట్లాట కడపట జూదముక్రింద పరిణమించినది. ఈయాటలవలన నేను రెండుమూడురూపాయలను గెలిచితిని. ఈయాటకయి యతఁ డొకసారి