పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

59

నన్ను మాయింటినుండి తనమిత్రుని యింటికిఁ గొనిపోయెను. ఆతనిమిత్రు లాతనివలెనే విద్యాగంధము లేని దుర్వ్యాపారులు. ఈసోమరిబృందముతోఁ గలిసి నేను పెక్కుమాఱులు డబ్బు పెట్టి జూద మాడితిని. నామిత్రుఁడును మిత్రుని మిత్రులును గలసి చీట్లాటకు మంచిస్థలము చూపెదము రమ్మని యొకబోగము వానియింటికి నన్నుఁ దీసికొనిపోయిరి. ఆదినమున నొకముసలిజూదరిమాత్రమే మాతోచీట్లాడెనుగాని మఱుసటిదినమునందు వాఁడు తనకూఁతురయిన పడపు పడఁతినిగూడఁ గొని వచ్చి యాటకుఁ గూర్చుండఁబెట్టెను. ఇంకను గొంత కాల మీదారినేయనుసరించి యుండినయెడల నేను నీతిమాలిన నిర్భాగ్యుఁడనయి చెడియుందునుగాని యీశ్వరానుగ్రహమువలన నింతలోఁ దెలివి తెచ్చుకొని, కడచినదాని కనుతాపపడి వెంటనే నాదుర్వ్యాపారమునుండి మరలుకొని, నామిత్రునితోడి సాంగత్యమును విడిచి పెట్టితిని. పయిదానివలన సత్ప్రవర్తనమునకు సజ్జనసాంగత్య మావశ్యకమని ఫలితార్థము తేలుచున్నది. స్వభావముచేత నెంతమంచివాఁ డయినను దుర్జనసాంగత్యములోఁ బడిపోయి దుర్వ్యసనములలోఁ దగులుకొన్న పక్షమునఁ దనవివేకమును గోలుపోయి తాను పూనిన వ్యాపారమే మంచి దనుకొనునంతటి దుస్థ్సితిలోనికి వచ్చి మానహీనుఁడయిన దుష్టుఁ డగును. ఇది మనస్సునం దుంచి బాగుపడఁ గోరువారు దుస్సంగదూరు లగుటకు సర్వవిధములఁ బాటు పడవలయును.