పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

57

యమున భిన్నాభిప్రాయము చెందిన నవనాగరిక బృందములోనివాఁడను. అది గాక ఛాందసుఁడనుగా నున్న కాలములోసహితము దుర్నీ తిపయి నాకు సహజ ద్వేషము; అప్పుడు సహితము దుర్నీ తిపరులను చూచినప్పుడు నాతల కంటగించుచుండెను. నే నాయనయింటివద్ద పని చూచుచున్న కాలములో సహితము కొన్ని సమయములయం దాయన యుంచుకొన్న వేశ్య నిశ్శంకముగా వచ్చి సరసను గూర్చుండి యాయనతో సరససల్లాపము లాడుచువచ్చెను. అది సరిపడక నామనస్సు నన్ను బాధించుచు వచ్చెను.. అందుచేత మొదటి నెల జీతము పుచ్చుకోఁగానే నే నాపని మానివేసితిని. వేశ్యాసంగమదోషము మాట యెట్లున్నను, కామరాజుగారు నావిషయమున సర్వవిధముల దయతోను గౌరవముతోను మెలఁగుచు వచ్చిరనియు నా కెప్పుడును కోపకారణము నణుమాత్రమును గలిగింపలేదనియు నే నిచ్చటఁ జెప్పవలసియున్నది. అటు తరువాత రాజమహేంద్రవరమండల పాఠశాలకు ప్రధానోపాధ్యాయులైన బారోదొరగారివద్దను, కారాగృహములపై నధికారియైన కెప్టెన్ హాల్లెట్టు దొరగారివద్దను, తెలుఁగుచెప్పుటకయి పని కుదిరితిని. వా రిరువురివలనను నాకు నెలకు ముప్పదియైదురూపాయలు వచ్చెడివి. 1869 వ సంవత్సరమున నేను పరీక్షకుపోలేదు. 1870 వ సంవత్సరమునందు బారోదొరవారు ప్రకటించు చుండిన 'గోదావరీ విద్యాప్రబోధిని' (Godavery Educationist) అను మాసపత్రికకు నేను తెనుఁగున వ్రాయుచుంటిని. నాశుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచననైషధ మాపత్రికయందే మొదట కొంచెముభాగము ప్రకటింపఁబడినది. నేను పాఠశాలలో చదువకయే 1870 వ సంవత్సరమున సర్వకలాశాలాప్రవేశ పరీక్షకుఁ బోయి కృతార్థుఁడ నయితిని.

ఈప్రకరణమును ముగింపకముందు దీనిం జదివెడు యువజనులకు మిత్ర సంగ్రహమునుగూర్చి కొంచెము హెచ్చరిక చేయవలసియున్నది. పదునాఱు సంవత్సరములు మొదలుకొని యిరువదిసంవత్సరములవఱకును మనకు సుగుణములుగాని దుర్గుణములుగాని పట్టుపడ నారంభించి తరువాత నవి స్థిరపడిపో