పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

53

వెడలిపోయెను. దయ్యములు స్మశానవాటికలయం దర్ధ రాత్రసమయమున సంచారము చేయుచుండునని యెల్లవారును జెప్పుచుండుటచేత వానిని జూడవలె నన్న యుత్కంఠతో ననేకపర్యాయములు నిశాసమయమున పడకనుండి లేచి యెవ్వరితోను జెప్పక మాపట్టణములో 'నెఱ్ఱరాళ్ళ' సమీపముననున్న స్మశాన భూమి కొంటిగాఁ బోయితిని. పాముకఱుచునో, తేలుకుట్టునో, దొంగలు కొట్టుదురో, అనుభయము తక్క పిశాచభయమెంతమాత్రమును లేక విపుల మనోరథుఁడనై తిరిగి వచ్చుచుండెడివాఁడను. ఈ సంగతి యితరులతోఁ జెప్పఁగా వారు పిశాచగణములలోఁ బుట్టినవారికిఁగాని దయ్యములు కనఁబడవని నాకు సమాధానము చెప్పెడివారు. ఇప్పటివలెఁ గాక నాచిన్నతనము నందు దయ్యములయందలి విశ్వాస మెల్లవారికి నత్యధికముగా నుండెను. అప్పుడు దయ్యములేనియిల్లు లేనే లేదని చెప్పవచ్చును. ఎవ్వరు క్రొత్తగా చచ్చినను వారు దయ్యములయి తిరుగుచుండిరని యెల్లవారును జెప్పుకొనుచుండిరి. దయ్యములను పాఱఁద్రోలుమంత్రగాండ్ర సంఖ్యయు నిప్పటికంటె నప్పుడు శతగుణాధికముగా నుండెను. ఏదియైన వింతసంగతిని విన్నచో శోధించి దానినిజమును గనుఁగొనవలె ననియు, విన్న దాని నెల్ల విశ్వసింపఁ గూడదనియు, విశ్వసించినదాని ననుసరించి ప్రవర్తింపవలెననియు, నాకు మొదటినుండియు నైసర్గి కాభిరతియై యుండెనుగాని యాలోచన లేక యొరులు చెప్పున ట్లెల్లను నడచు స్వభావ మెప్పుడును లేదు. అందుచేత నేను గొన్ని సమయములయం దహంభావమును స్వచ్ఛందచారిత్వమును గలవాఁడనయి యితరులయభిప్రాయములయందు గౌరవముంచ కుండెడివాఁడను. నా కాకాలమునందు విద్యార్థులుమాత్రమేకాక కొంద ఱుపాధ్యాయులును మిత్రులుగా నుండిరి. ఒకనాఁడు సాయంకాలము నేనును నామిత్రులగు కొంద ఱుపాధ్యాయులును విద్యార్థులును గలిసి యూరిబైటికి సంచారార్థము పోయితిమి. అట్లు క్రోశదూరముపోయి సూర్యాస్తమయసమయమున వెనుక మరలి మేము నడచెడురథ్య రెండుశాఖ లయినచోటికి వచ్చి నిలిచితిమి. అం దొక