పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

స్వీయ చరిత్రము.

దారి యంగళ్లవాడనుండి పట్టణమునకుఁ బోవును; ఇంకొకదారి గోదావరి యొడ్డునుండి పట్టణమునకుఁ బోవును. ఇం దేదారిని బోవుదమని మాలోమాకు పశ్నవచ్చినది. నే నొక్కఁడను నదీతీరవీధినుండి పోవుదమంటిని; తక్కిన వారందఱును విపణివీధినుండి పోవుదమనిరి. అప్పుడు నాతోడివారు విపణి మార్గమునుబట్టి, నేను వెంటవత్తునేమోయని తిరిగితిరిగి చూచుచు మెల్లఁగా నడవసాగిరి; నేను వారిమార్గము ననుసరింపక తిన్నఁగా గోదావరియొడ్డునుండి పోయి యిల్లుచేరితిని. వాడుకప్రకారము మఱునాఁడును మే మావైపునకే సంచారార్థము పోయి మరలి వచ్చునప్పు డేశాఖామార్గమున పట్టణమునకుఁ బోవలెనని మే మాస్థలముననే మగుడ శంకించుకొంటిమి. గతదినమునందు వలెనే నాఁడును మా కభిప్రాయ భేదము కలుగఁగా నే నొక్కఁడను గోదావరిదారిని నడవఁ దొడఁగితిని. నా మిత్రు లంతట తమపట్టు విడిచి నాకు లోఁబడినవారయి, నే నితరులు చెప్పినట్టు విననివాఁడనని పలుకుచు నామార్గము ననుసరించిరి. ఇట్టి పట్టుదలను ధర్మాచరణముతో సంబంధించిన ముఖ్యాంశములలోఁ జూపుట యావశ్యకమును కర్తవ్యము నే యైనను, ధర్మభంగము లేని యిటువంటి యల్పాంశములలోఁ జూపుట యనాదరణీయమును మూర్ఖత్వమును నగును. నీతికిని సత్యమునకును ధర్మమునకును భంగము కలుగని విషయములలో నెల్లను బహుజనవాక్యమును మాననీయముగా భావించి తదనుసారముగా పెద్దలకు లోఁబడి నడచుట కర్తవ్యమని తెలుపుటకే దీని నిందుఁ జెప్పితినిగాని నేను జేసినపని మంచిదని చెప్పుటకయికాదు. దీనివలన సాధారణముగా బాల్యమునుండియు నాది పట్టినపట్టు విడుచుస్వభావము కాదని తేటపడును. ఈకాలమునందే నాకు నాపూర్వవిశ్వాసములు కొన్ని మాఱుట కారంభించుటయు సంభవించెను. నామిత్రులగు చల్ల పల్లి రంగయ్య పంతుల వారియొద్దనుండియో మఱియెవ్వరియొద్దనుండియో కేశవచంద్రసేనులవారి యుపన్యాసములు కొన్ని పుచ్చుకొని చదివితిని. ఆయుపన్యాసములు చదువుట వలన నే నావఱకు సత్యములని నమ్ముచుండిన కొన్ని విషయములనుగూర్చి సం