పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

స్వీయ చరిత్రము.

వరపురీ గోపాలా" యనియుండును. ఈకడపటిశతకములోని యీక్రింది పద్యమొకటి మాత్ర మభాగ్యోపాఖ్యానములో మొదట వేయుటచేత నిప్పటికి నిలిచియున్నది.

                 క. శ్రీరమణీహృల్లోలా, కారుణ్యలతాలవాల కాంచనచేలా
                    ఘోరాహవజయశీలా, శ్రీరాజమహేంద్రవరపురీగోపాలా.

ఈశతకములు బాగుగ లేవనియు, ఛందోవ్యాకరణదోష భూయిష్ఠములనియు, నే నుపేక్షించి యొకమూలఁ బాఱవేయుటచేతనే నశించిపోయినవి. నే నప్పుడు శైవవైష్ణవ మతములలో దేనియందును విశేషపక్షపాతము లేనివాఁడనై, శివకేశవులు సమానులన్న విశ్వాసముతో నుభయుల నారాధించుచు, వేదాంతమునం దెక్కువ యభిరుచిగలవాఁడనై యుండెడివాఁడను. మంత్ర ప్రభావమునందును బరమవిశ్వాసముగలవాఁడనై వేలకొలది గాయత్రీజపము చేయుచు నుండుటయేకాక యాంజనేయమంత్రమును రామమంత్రమును ఉపదేశమునొంది బహువారములు పునశ్చరణముచేసితిని. మంత్రమహిమవలన దయ్యములు వదలిపోవునని నమ్మి, వానిని బ్రత్యక్షముగాఁ జూడవలెనన్న యభిలాషముతో దయ్యములు పట్టినవన్న వారియిండ్ల కెల్లనుబోవుచు భూత వైద్యులు చేయు మంత్రతంత్రములనెల్లఁ జూచుచు మంత్రవేత్తల నాశ్రయించుచుండెడివాఁడను. భూతవైద్యుల నెందఱినో యనుసరించి యొక్క భూతమునైనను జూపుఁడని యెన్ని విధముల వేఁడినను నా కొక్కరును జూపినవారుకారు. ఒక భూతవైద్యుఁడుమాత్రము నాకు దయ్యమును జూపెదననిచెప్పి, ఒకనాటిరాత్రి నన్ను దూరముగా నూరివెలుపలి కొకమఱ్ఱిచెట్టు వద్దకుఁ గొనిపోయి, చూపక "చూపినచో నీవు జడిసికొందువు" అని చెప్పి తప్పించుకొనఁజూచెను. నేనెంతమాత్రము జంకక "నేను జడిసికోను. నా యందనుగ్రహించి తప్పక చూపుము" అని వేఁడి ధైర్యముతో నిలువఁబడితిని. అంతట నతఁడు "నీవు భయపడక పోయినను ప్రభుత్వమువారివలన నాకు చిక్కు వచ్చును. నేను చూపను" అని చెప్పి నాకాశాభంగము కలిగించి