పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

స్వీయ చరిత్రము.

ననియు, మొదట బెదరించి చూచెను; తరువాత మాంచిమాటలాడుచు తోడనే వచ్చినవారిని క్షమించి బహుమానము లిచ్చెదనని వర్తమానము పంపెను; అటుపిమ్మట బాలురను వేఁడుకొనియు వారిని మందలించి పంపుఁడని సంరక్షకులకు వ్రాసియు మరల బాలురను పాఠశాలకు రప్పించుటకయి బహు ప్రయత్నములు చేసెను. ఎంత చేసినను చేసినప్రయత్నము లన్నియు భగ్నములయి భస్మములోని యాహుతు లయ్యెను. అంతట నతఁడు విఫలమనోరథుఁ డయి తొందరపడి చేసినపనికి సావకాశముగా పరితాపపడుచుండెను. మేము మఱునాఁడే సంఘవిజ్ఞాపనపత్రములను మరల సిద్ధముచేసి వానిమీఁద ప్రధానోపాధ్యాయునకును సంరక్షకులకును భయపడి కొందఱు వ్రాళ్ళు చేయకపోయినను, అధిక సంఖ్యాకులచేత వ్రాళ్ళు చేయించి యొకప్రతిని విద్యావిచారణ కర్తకు చెన్నపురికిని, ఇంకొకప్రతిని పాఠశాలాపరీక్షకునకు విశాఘపట్టణమునకును, బంపితిమి. అంతేకాక యాదినముననే విద్యావిచారణకర్తయగు కర్నల్ మగ్డానల్డుదొరగారికిని, పాఠశాలాపరీక్షకులగు గ్రిగ్గుదొరగారికిని, తంత్రీవార్తలనుగూడఁ బంపితిమి. వెంటనే రాజమహేంద్రవరమునకుఁ బోయి విచారణ చేయవలసినదని విద్యావిచారణకర్తగారు పాఠశాలాపరీక్షకునకు వ్రాసి, మా విజ్ఞాపనపత్రమును వారికిఁ బనిపిరి. గ్రిగ్గుదొరగారు కొన్ని దినములలో రాజమహేంద్రవరమునకు వచ్చి మమ్మందఱిని పిలిపించి విచారణ చేసి, వైయాపురి మొదల్యారిగారిని వేఱొకచోటికిఁ బంపి వేయవలసినదని పయికి వ్రాసిరి. అందుచేత విద్యావిచారణాధికారిగారు వైయాపురిమొదల్యారిగారిని నరసాపురమునకుఁ బంపి, అక్కడనుండి చెంగల్వ కుప్పుస్వామి శాస్త్రులవారిని రాజమహేంద్రవరమండల పాఠశాలకు పధానోపాధ్యాయునిఁ గాఁ బంపిరి. అటు తరువాత మే మందఱమును మరల పాఠశాలకుఁ బోయి చేరితిమి. మొదటి విజ్ఞాపనపత్రము నెత్తుకొని పోయి ప్రధానోపాధ్యాయుని కిచ్చినవిద్యార్థి యితరవిధ్యార్థులధాటికి తాళలేక రాజమహేంద్రవరములో నుండి చదువుట యసాధ్య మయినందున మాపాఠశాలను విడిచి విశాఖపట్టణమునకుఁ బోయి యచ్చటి ప్రభుత్వము వారిబోథనాభ్యసన పాఠశాలలోఁ జేరెను.