పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

47

యని తిట్టెను. ఆమాటయనఁగానే చివాలున లేచి నేను తరగతిని విడిచి యావలికిఁబోయితిని. నా వెంబడినే నాతరగతిలోని బాలురందఱును తమస్థలమునువిడిచి వెలుపలికివచ్చి నాతోఁ గలిసి యిండ్లకుఁబోయిరి. ఆప్రధానోపాధ్యాయుఁ డాదినమువఱకును నన్నెప్పుడును చిన్న మెత్తుమాట యనక యెంతో గౌరవముతోఁ జూచుచుండెడివాఁడు. తెలివి గలవాఁడనని మాత్రమేకాక శాంతచిత్తుఁడ ననియు వినయపరుఁడ ననియు సాధువర్తనుఁడననియుఁగూడ నాయం దాయనకు విశేషప్రేమము. ఆసంఘవిజ్ఞాపనములో నా వ్రాలు మొట్టమొదటఁ జూచువఱకును తనప్రియశిష్యుఁడనైన నే నింతపని చేయుదునని యాతఁడు స్వప్నావస్థయందును దలఁచియుండలేదు. నేను సాధారణముగా శాంతస్వభావము గలవాఁడనే యయినను, న్యాయవిషయమున నాగ్రహకారణము కలిగినప్పుడు నాయుద్రేకమునకును పట్టుదలకును పరిమితి యుండదు. అప్పుడు నేను గురువనియు బంధు వనియు స్వేహితుఁ డనియు బలయుతుఁ డనియు జూడక పూనినకార్యమునందు దీక్షవహించి కడవఱకును పని చేయుదును. సంతకము లయిన విజ్ఞాపనపత్రము పోవుట, మిత్రునకు దండనము కలుగుట, నాకు నాతరగతిలోని వారిముందఱ నవమానము కలుగుట మిదలైనవిఘ్నము లనేకములు ప్రధమప్రయత్నములోనే కలిగినను నేను లేశ మాత్రమును జంకక, ఆప్రధానోపాధ్యాయుని నక్కడనుండి పంపివేయువఱకును నిశ్శంకముగా పని చేయవలయునని నిశ్చయించుకొంటిని. నామాటలను వినునపుడు నాసహపాఠులకును సఖులకునుగూడ వీరావేశము కలుగుచుండును. ఈ విషయమున మాపాఠశాలలోని సహాయోపాధ్యాయులుకూడఁ గొందఱు మమ్ము ప్రోత్సాహపఱిచిరి. మేము కట్టుకట్టి మఱునాటినుండి పాఠశాలకుఁ బోవ మానితిమి. మఱుసటినాఁడు ప్రధానోపాధ్యాయుఁడు పాఠశాలకుఁ బోవునప్పటికి వట్టిబల్ల లేకాని పిల్లలు లేకుండిరి. అతఁ డది చూచి లోపల భయపడినను పయికి లేని గాంభీర్యము పూని వెంటనే పాఠశాలకు రానియెడల పేరులు తీసివేసెద ననియు, రెండుదినములలోపల రానివారి నందఱిని కొట్టెద