పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

49

1868 వ సంవత్సరములో నేను మరలఁ బాఠశాలలోఁ జేరినను, నాకా సంవత్సరమునను చదువు జరగలేదు. మా పెత్తండ్రిగారి మరణానంతరమున చరరూపమైన సొత్తంతయు పట్టుకొని యాయనభార్య తనపుట్టినింటికిఁ బోయెను. అప్పు డామెకు సంతానములేదు. మరణకాలమునకు మా పెదతండ్రిగారికి ఋణము లేమియు లేకపోవుటయేకాక కొంత రొక్కముకూడ నుండెను. మా పెదతండ్రిగారివంతునకు వచ్చినగృహభాగము మిక్కిలి విశాలమయి పట్టణ మధమునం దుండెను. అందుచేత దాని నెట్లైన నపహరింపవలెనని ప్రముఖు లనేకులు దానిమీఁద కన్ను వేసియుండిరి. ఆయిల్లు మా పెత్తల్లి యనంతరమున నాకు రావలసినదిగా నుండెను. ఆయింటి నపహరింపవలె నని కన్ను వేసియున్న వారిలో నొక రిద్ద ఱది విక్రయింపుమని నా పెదతల్లిని ప్రోత్సాహపఱిచిరి. ఆమె దానిని విక్రయించి చేరిన రొక్కమును దీసికొనిపోవలెనని ప్రయత్నించెను గాని వితంతువిక్రయమగుటచేతను, దాని కనంతరకర్తనైన నేను జీవించి యుండుటచేతను, క్రయము చెల్ల నేరదని శంకించి యెవ్వరును తగినవెల యిచ్చి కొనసాహసింపకుండిరి. అందుచేత నామె యెంతతక్కువ మొత్తమునకైనను విక్రయించి రొక్కము చేసికోవలెనని చూచుచుండఁగా, పాపభీతిలేని యొక గొప్పగృహస్థుఁ డాయి ల్లామెవద్ద నతిహీనక్రయమునకు వ్రాయించుకొని, ఆయల్పధనమునైన నప్పు డామె కియ్యక భర్తయొక్క యుత్తరక్రియలనిమిత్తము ఋణములు చేసినట్టుగా నెవ్వరికిని దెలియ కుండ నిష్టులైన వారిపేర దొంగపత్రములు వ్రాయించి, వారిచేత నామె పుట్టినింటివారి గ్రామమునకు చేరువనుండిన న్యాయస్థానములో వ్యాజ్యములు వేయించి తీర్పులను బడసెను. ఈసంగతి నాతల్లికిఁ దెలిసి నన్నుఁదీసికొని వృద్ధుఁడును బంధుఁడునైన యొక న్యాయవాదికడకుఁ బోయి, తదనంతరస్వామ్యమునిమిత్తము వ్యాజ్యము తెచ్చి గృహవిక్రయము నాపింప వలసినదని యాయనను వేఁడెను. మా గృహరహస్యములను బూర్ణముగాఁ దెలిసినవాఁడైన యాన్యాయవాది కొంచెముసే పాలోచించి, యావఱకు జరిగినవిభాగము క్రమమయినది కాదనియు, విభాగపత్ర