పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

45

నుండి పంపి వేసి సమర్థుఁడైన మఱియొకరి నాయనస్థానమునకు రప్పించుట కర్తవ్యమని నాకు నిశ్చితాభిప్రాయము కలిగినది. నాసహపాఠులైన యితర బాలురతో నాలోచింపఁగా వారును నాయభిప్రాయముతో నేకీభవించిరి. నాకొక యభిప్రాయము పుట్టుటకును దానిని నెఱవేర్ప బూనుటకును నడుమ తడవు విశేషముగా నుండదు. అందుచేత తోడనే విద్యా విచారణాధికారి గారికిఁ బంపు నిమిత్త మింగ్లీషున నొక సంఘ విజ్ఞాపనము వ్రాసి దానిపైని మాతరగతిలోనివారిచేత వ్రాళ్లుచేయించి, తక్కిన తరగతిలోని బాలురచేత వ్రాళ్లు చేయించుటకై నాబాల్య సఖుఁడును మాక్రింది తరగతిలో చదువుకొను చున్న వాఁడును హీమవత్పర్వతముమీఁది తపశ్చరణమునకై వెడలిన మువ్వురిలో నొకఁడునునైన కనపర్తి లక్ష్మయ్యగారిచేతికిచ్చి యొక భానువారము నాఁడా విజ్ఞాపనపత్రమును బంపితిని. ఈలోపల నేలాగుననో యీ విజ్ఞాపన పత్రవార్త మాప్రధానోపాధ్యాయునికిఁ దెలిసి, ఏదో మిషచేత దానినితెచ్చి తన కిమ్మని మాతరగతిలోనే చదువుకొనుచుండిన మొండ్రేటి రామచందుఁడను నాతనిని బ్రేరేచి యొడఁబఱిచెను. అతఁడు తా నందు వ్రాలుచేసి తెచ్చునట్లు నటించి, నామిత్రునిచేతిలోనుండి విజ్ఞాపనపత్రమును గైకొని తనయింటిలోనికిఁ దీసికొనిపోయి, దొడ్డిదారిని తిన్నఁగా నడిచి దానిని మాప్రధానోపాధ్యాయునికిచ్చెను. ఇట్లు మోసపోయి నామిత్రుఁడు దీన వదనముతో మాయింటికివచ్చి జరిగిన కధను నాకు దెలిపెను. నే నంతటితో నిరుత్సాహుఁడనుగాక నా మిత్రుని నేమియు ననక, నాయొద్దనున్న మాతృకనుజూచి మఱియొక ప్రతిని వ్రాసి సంతకములు చేయించి పంపవచ్చునని చెప్పి యాతని నింటికిఁ బంపివేసితిని. ఆమఱునాఁడు యథా ప్రకారముగా పాఠశాలకుఁ పోయినప్పుడు మా ప్రధానోపాధ్యాయుఁడు చేత బెత్తము పట్టుకొని నాలవ తరగతిలోనికిఁ బోయి నామిత్రుని గొడ్డును బాఁదినట్లు బాఁదెను. అది చూచినప్పుడు నామనస్సునకు సహించరాని నిర్వేదము కలిగెను. నా కెంతబాధ కలిగినను నే నోర్చుకొనియుండఁ గలుగుదునుగాని యితరులకు నిష్కార