పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

స్వీయ చరిత్రము.

ప్పించెదనని చెప్పెను. ఇట్లుండఁగా రెండుమూడుదినముల కాపని పరీక్షాసిద్దుఁడు కాని మఱియొకని కియ్యఁబడినట్టు నాకుఁ దెలిసినది. ఇది యెట్లయ్యెనాయని విచారింపఁగా సిరస్తాదారుగారు నూఱు రూపాయలు పారితోషికముగా స్వీకరించి యాపని యాతనికి వేయించినట్టు తెలియవచ్చినది. రూపాయలగాలి సోఁకినప్పుడు వానిముందఱ బంధుత్వమును మిత్రత్వమును సమస్తమును తృణ కణములవలె నెగిరిపోవలసినవే గదా! నేను మరలఁ బోయి దొరగారిని జూచినప్పుడు నీకింత చిన్న తనములోఁ బని యేల యనియు, చదివి గొప్పపరీక్ష లిచ్చినతరువాతఁ దామే గొప్పపని నిచ్చెద మనియు, చెప్పి నన్నుఁ బంపి వేసిరి. ఆ పనియే నా కప్పుడయియుండినయెడల నెలకు పదిరూపాయలచొప్పున సద్యఃఫలము లభించియుండును. ఆపని నాకుఁ గాకుండుట యీశ్వరుఁడు నామంచి కొఱకే చేసెననవచ్చును. ఆపనిలోనే యుండుట తటస్థించెనేని, శ్లేష్మములోఁ బడిన యీఁగవలె రేయింబగళ్ళు బండపనిలో మునిఁగి కొట్టుకొనుచు నిరంతర శరీరక్లేశపీడితుఁడనై పరోపకార చింత లేక నే నెట్టిదురవస్థలో నుండియుందునో ! ఈశ్వఁరు డీలోకములో సర్వమును మనమేలుకొఱకే చేయును. అట్లాశాభంగము కలుగుట కలుక పొడమినవాఁడ నయి, ముందెప్పుడును న్యాయసభలో లేఖకోద్యోగమునందుఁ బ్రవేశింపకుండునట్లు శపథముచేసికొని, మరలఁ బాఠశాలకుఁ బోవ నారంభించితిని. ఇది యిట్లుండఁగా నడుమ మఱి యొక విచిత్రకథ సంభవించి నావిద్యకు వేఱువిఘ్నము నాపాదించెను. అప్పుడున్న ప్రధామోపాధ్యాయుఁడైన వైయాపురి మొదల్యారిగా రింగ్లీషుభాష యందు విశేష సాహిత్యము లేనివారగుటచేత, పరీక్షకు, నిర్ణీతమైన యింగ్లీషు పద్యకావ్యమును చక్కఁగా బోధించుటకు సమర్థులుగాక యుండిరి. అట్టియసమర్థుఁ డాయున్నత పదమునందుండుట క్రమము కాదని నాకుతోఁచెను. ఎక్కడనేయక్రమము కనఁబడినను నాది సహించి యూరకుండెడి స్వభావము కాదు; ఆయక్రముమునకుఁ బ్రతిక్రియను జూచువఱకును నామనస్సున కూఱట కలుగదు. అంచేత విద్యార్థులలాభము నిమిత్తమాయన నక్కడ