పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

స్వీయ చరిత్రము.

ణముగా బాధ కలిగినప్పుడు సహించియుండఁజాలను. అందులోను నానిమిత్త మొరులకు బాధ కలిగినప్పుడు నామనస్సెట్లు పరితపించునో వివరించుటకు బాష చాలదు. స్వవిషయమున నే నెట్లు బాధ కోర్చుకొనఁ గలుగుదునో తెలుపుటకై నాచిన్న నాఁడు నడచిన యొకసంగతి నిచట సంక్షేపముగాఁ జెప్పెదను.

పది పండ్రెండేండ్లప్రాయమునం దొకప్రాతఃకాలమున మాదొడ్డిలోని పాదునచిక్కుడుకాయలు కనఁబడఁగా వానిని గోయఁ జూచితినిగాని క్రిందినుండి నా కవియందలేదు. కాఁబట్టి నేను కాయలకయి పందిరిగుంజపయి కెక్కితిని. ప్రాఁతదగుటచేత నడిమికి విఱిగిపోయి యాగుంజ నేలవ్రాలఁగా దానితో పయినుండి నేనును నేలఁ గూలితిని. అప్పు డాగుంజయొక్క విఱిగిన వాఁడియయినభాగము నాయఱకాలిలో గ్రుచ్చుకొని లోఁతుగా దిగి కాలి నుండి నెత్తురుప్రవాహము కట్ట నారంభించినది. నేను వెంటనే లేచి కూరుచుండి యేడువక యెవ్వరిని బిలువక ధైర్యమవలంబించి నాపై బట్టతీసి గట్టిగా కాలికి చుట్టఁబెట్టి, మెల్లగా మామేడమీఁదికిఁబోయి తలుపులోపల వేసికొని కట్టువిప్పు, గాయములో విఱిగియున్న కఱ్ఱముక్కలను దీసివేసి, మరల కట్టు కట్టుకొని తలుపుతీసి యొక గదిలో మూలఁ బరుంటిని. నేను వేళకు భోజనమునకు రాకపోవుటచేత మావాండ్రు నన్ను వెదకి యెక్కడను గానక కడపట మేడమీఁదికివచ్చి నేను కట్టు విప్పినచోటను కాఱియున్న రక్తమును జూచి భయపడి, నన్ను పిలిచియు బదులుగానక నేనున్న గదిలోనికి వచ్చి యొకమూల నొదిగిపరుండియున్న నన్నుఁజూచి, కారణమును దెలిసి చికిత్స చేయించిరి. అప్పటి గాయపుమచ్చ యిప్పటికిని నా యెడమపాదమున నంగుళము వెడల్పునఁ గనఁబడుచున్నది.

ప్రధానోపాధ్యాయుఁ డట్లు నామిత్రుని గొట్టినప్పుడు దీనికిఁ బ్రతివిధాన మేమిచేయవలెనా యని యాలోచించుచు నేను పరధ్యానముతో నుండఁగా అతఁడు మాతరగతిలోనికి వచ్చి కోప మాపుకొనలేక నన్ను "బుద్ధిహీనుఁడా"