పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

స్వీయ చరిత్రము.

చేయునప్పుడు రాజశాసనప్రకరణభాగములలో నేదియైనను వారికి స్మరణకు రాకపోయెనేని నే నందుకొని మంచముమీఁదనుండి చెప్పుచుండెడివాఁడను. నా ధారణాశక్తికి వా రాశ్చర్యపడుచుండెడివారు. ఆ సంవత్సరముననే వా రిరువురును తత్పరీక్షాసిద్ధులైరి. ఈపరీక్షలో ధన్యతఁ బడసినతరువాత నా పెద తండ్రిగారికి ప్రాడ్వివాక సభలో ప్రధానవిలేఖకోద్యోగ మైనది. అందుచేత రాజమహేంద్రవరమును విడిచి కొంతకాల మాయన పెద్దాపురములోను, అమలాపురములోను; ఏలూరిలోను, ఉండుచు వచ్చిరి. ఆకాలమునందు నేనును నాతల్లియు వేసవికాలపు సెలవులలోను శీతకాలపు శెలవులలోను బోయి వారి యొద్దనే యుండుచుండెడివారము. అప్పుడు నా పెదతల్లియు తల్లియు నొండొరులతో మాటాడుచు లోపల మనస్స్పర్ధ యొక వేళ నడఁగియున్నను పైకి మైత్రి కలిగియే యుండెడివారు. అందుచేత మే మవిభక్తకుటుంబమువలెనే యుండెడివారముగాని విభక్తకుటుంబమువలె నుండుచుండలేదు. నాలవతరగతిలోను సంవత్సరాంతపరీక్షలో నేనే మొదటివాఁడనైతిని. పరీక్షాప్రశ్నముల కేర్పఱుపఁబడిన పరమసంఖ్య 480లో నాకు వచ్చినసంఖ్య 420. అప్పటి పాఠశాలాపరీక్షకులైన బవర్సుదొరగారు నా తెలివి కద్భుతపడి నన్ను ప్రత్యేకముగా తమగదిలోనికిఁ బిలిపించి చేరువను గూర్చుండఁబెట్టుకొని, ఆదరముతో నా వీపుమీఁద తట్టి, యిచ్చటఁ బ్రవేశపరీక్షం దేఱినతరువాత చెన్న పురికిఁ బోయి పట్టపరీక్షవఱకును తప్పక చదువవలసినదని హితబోధచేసిరి. పరీక్షయందు వరుసగా రెండుసంవత్సరములు ప్రథఁముఁడుగాఁ, దేఱినవానికి పుస్తక బహుమాన మిచ్చుటయే కాక సంవత్సరకాలము జీతము లేకుండ చదువుకొన నిచ్చుచుండిరి. ఆసంవత్సర బహుమానసమయమునందు సద్వర్తనము నిమిత్తమయి యిచ్చిన పుస్తకములును పరీక్షయందగ్రపదమును బడసినందున కిచ్చిన పుస్తకములునుగలిపి నేను మోయలే నన్ని యాయెను. ప్రవేశపరీక్షతరగతిలోఁ జదువునప్పుడు నేను పాఠశాలలో జీత మియ్యవలసిన పని లేపోయెను.