పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

41

యు నాయం దపరిమితాదరము కలిగియుండెను. మాకుఁ గొంతకాలము వైయాపురి మొదల్యారిగారు ప్రధానోపాధ్యాయులుగానుండిరి; ఆయనకు గణితశాస్త్ర పరిజ్ఞానము విశేషముగా నుండినను భాషాజ్ఞానముమాత్ర మల్పమై యుండెను. ఇంగ్లీషుపద్యకావ్యములయం దాయన కర్థముకాని భాగములకుఁ గొన్ని సమయములయందు నేను సరియైన యర్థము చేయుచుండఁ గలుగుట చూచి యింగ్లీషు నందు నేను గట్టివాఁడనని యాయన యెల్లరతోను జెప్పుచుండెడివాఁడు. ఆయన తరువాత మాకు శ్రీ చెంగల్వ కుప్పుస్వామిశాస్త్రులవారు ప్రధానోపాధ్యాయులుగా వచ్చిరి; వారి కింగ్లీషునందు మంచిపాండిత్య మున్నను గణితశాస్త్రపాండిత్య మల్పమైయుండెను; ఆయన చేయ లేని లెక్కలను నేను జేయఁ గలుగుచుండుట చూచి గణితశాస్త్రమునందు నేను గట్టివాఁడనని యాయన యెల్లరతోను జెప్పి నన్ను మెచ్చుకొనుచుండెడివారు. నిజముచేత నేను తెలుఁగునందుఁ గాని యింగ్లీషునందు గాని లెక్కలయందు గాఁని భూగోళశాస్త్ర దేశచరిత్రాదులయందుఁగాని దేనియందును న్యూనత లేనివాఁడనయి యుంటిని. దేశపటములను వ్రాయుటయందు తక్కిన బాలురకంటె నా కెక్కువ నైపుణి కలిగియుండెను. నా కప్పుడు గ్రహణ ధారణ శక్తులును బుద్ధిసూక్ష్మతయు నసాధారణములుగా నుండినను వానివలన ఫలములేకుండఁ జేయుటకై యలసభావమును నిరంతరకృషిరాహిత్యమును గూడ నన్నాశ్రయించి పీడించు చుండెను. అప్పటి సాధారణాశక్తి కొక్కదృష్టాంతమును వినుఁడు. నేను రెండవతరగతిలో నో మూడవతరగతిలోనో చదువుకొనుచుండినకాలములో నా పెదతండ్రిగారును ములుకుట్ల గంగన్న గారును గలిసి మా యింట రాత్రులు ప్రాడ్వివాక (డిస్ట్రిక్టు మునసబు) పరీక్షకుఁ జదువుకొనుచుండెడివారు. నేను పరుండెదు మంచము వారు చదువుకొనెడు స్థలమునకు సమీపముననే వేయఁబడియుండెను. అందుచేత వారు చదివెడిది నేను పరుండి వినుచుండెడివాఁడను. వారు మఱునాఁడు చదువుట కారంభించునప్పుడు పుస్తకమును క్రిందఁబెట్టి ముందు గా గతదినము చదివినదాని చింతనము చేయుచుండెడివారు. అటు