పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

43

1867 వ సంవత్సరమునందు నే నయిదవతరగతిలో ననఁగా ప్రవేశపరీక్షతరగతియందు చదువుచుండినను నా కాసంవత్సరము చదువు సాగనేలేదు. మాపెదతండ్రిగారు రోగపడి యేలూరినుండి యౌషధసేవనిమిత్తమయి రాజమహేంద్రవరమునకు వచ్చి కొన్ని మాసములు వ్యాధిబాధితులయి యుండి లోకాంతరగతు లయిరి. ఆయన రోగపీడితులయి యున్న కాలములో మందుల కొఱకును వైద్యులకొఱకును తిరుగుచుండుటచేతను, ఆయనవ్యాధివలన నాకుఁ గలిగిన మనోవ్యాధిచేతను, నేను పాఠశాలకు సరిగా పోవుచుంటయు పాఠములు చదువుటయు తటస్థింపలేదు. నాపితృవ్య మరణానంతరమున పాఠశాలను విడిచి పనిలోఁ బ్రవేడింపుమని మాబంధువు లనేకులు నన్ను ప్రేరేపించిరి; వా రావిధముగా నాతల్లితోఁజెప్పి యామెచేతను నాకుఁ జెప్పించిరి. నాకు చదువు మానుటయం దెంతమాత్రము నిష్టము లేకపోయినను నాతల్లియొక్కయు బంధువులయొక్కయు ప్రేరణమువలన నాపూనికను విడిచి పనిలోఁబ్రవేశించుట కొడఁబడి, నాకు బహుమాన మిచ్చి నాయం దాదరము చూపుచుండిన మండలన్యాయాధిపతి యగు మారీసుదొరగారిని పనినిమిత్తమయి పోయి చూచితిని. నేను సామాన్యపరీక్షయందుఁ దేఱియున్న వాఁడ నగుటచేత రాజకీయోద్యోగమునకు యోగ్యుఁడ నయియే యుంటిని. ఆకాలమునం దాపరీక్ష యందుఁ గృతార్థు లయినవారు దొరకుటయు దుర్లభముగానే యుండెను. మారీసుదొరగారు నాకు బహుమాన మిచ్చినప్పటినుండియు నప్పుడప్పుడుపోయి యాయనను జూచుచుండెడివాఁడను. ఆయనయు నావిద్యా క్షేమములనుగూర్చి యడిగి నన్నాదరించు చుండెడివాఁడు. మా పెదతండ్రిగారు లోకాంతరగతులయినతరువాత నేను బోయి దర్శనము చేసినప్పుడు దొరగా రాయనమృతికి విచారించి మంచిమాటలతో నన్నూఱడించి, ఆయేర్పాటులో కడపటిదానిని నా కిచ్చెదనని వాగ్దానము చేసిరి. అప్పుడు మండలన్యాయసభలో సిరస్తాదారుగా నుండిన నెప్పల్లె లక్ష్మీనారాయనప్పగారు మాశాఖవాఁడును మాకుటుంబమునకు పరమాప్తుఁడునునయి యుండెను. ఆయన యాపని తప్పక నాకే యి