పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

33

సక్తికలిగియుండెనని యీవఱకే చెప్పియున్నాను. బ్రహ్మశ్రీ - ఓగిరాల జగన్నాధముగా రప్పుడు నూతనముగా రచించినసుమనోమనోరంజన ప్రబంధము నంతను మూఁడవతరగతిలోఁ జదువుకొనుచుండినప్పుడే కాగితములమీఁద వ్రాసికొంటినని నాచదువరులు విన్నప్పుడు నాకుఁ దెలుఁగునందుఁ గల యభిలాషాధిక్యమును వేఱుగఁ జెప్ప నక్కఱలేకయే తెలిసికోఁగలరు. ఆంధ్రకావ్యములలో నెల్లను వసుచరిత్ర ముత్తమ మైనదని పలువురు చెప్పుచు వచ్చిరి. అందుచేత దాని నేలాగున నైనఁ జదువవలెనని నామనస్సువ్విళ్ళూరఁ జొచ్చెను. మాయింటఁ గల తాటాకుల పుస్తకములనెల్లను విప్పిచూచితినిగాని వసుచరిత్ర మందుఁ గానరాలేదు. అప్పుడేమి చేయుటకును తోఁచనివాఁడనయి, నాతల్లి నడుగుదునా మానుదునా యన్న సందేహముచే డోలాందోళనమానసుఁడనయి కొన్ని దినములు నాలో నేను తలపోసి, తుదకు సాహసముచేసి యొకనాఁడు మెల్లగా నామెను డాయఁబోయి వసుచరిత్రమును కొనిపెట్టుమని దీనముగా వేఁడితిని. అది నాపాఠపుస్తకము కాదని యెఱిఁగినదయి యామె నాకోరికను చెల్లింపక నిరాకరించెను. ఇట్లాశాభంగము నొందినవాఁడనైనను, అంతటితో నిరాశచెంది యూరకుండక యేలాగుననైనను వసుచరిత్రమును గొని చదువవలెనని నిశ్చయించుకొంటిని. ఎట్లు కొనఁగలుగుదును ? అప్పుడాపుస్తకము వెల నాలుగురూపాయల యెనిమిదణాలు; నాచేత నెనిమిదణాలకంటె నెక్కువగాలేవు; నాతల్లి నడిగిన నేమియు నిచ్చుజాడ కనఁబడలేదు; న్యాయమార్గమున నంతవిత్తము నార్జించుటకును నాకప్పు డాధారము కనఁబడలేదు. అందుచేత నాయొద్ద నున్న యెనిమిదణాలును తోడనే పుస్తకవిక్రేతచేతిలోఁ బెట్టి, తరువాత నెల కెనిమిదేసి యణాలచొప్పున ప్రతిమాసము నిచ్చుచుండు పద్ధతిమీఁద పుస్తకమునుకొని చదువవలెనని, నాకప్పు డొక్కదురాలోచన తోఁచినది. నెలనెలకు నెనిమిదేసి యణాలచొప్పున నిచ్చు చుండుటకు సహితము నా కప్పుడు శక్తిలేదు. కాఁబట్టి ప్రతిదినమును వేళకు భోజనముచేసి పాఠశాలకుఁ బోవుచున్నట్లు నటించుచు నెక్కడనో కూరుచుండి సాయం