పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

స్వీయ చరిత్రము.

రాఁదగినదైనను, రాజమహేంద్రవరములో సహిత మిప్పు డాయింటిమీఁద మాసమునకు పదు నేనురూపాయలు వచ్చు చున్నను, ఆకాలమందు నాలుగు రూపాయలుమాత్రమే వచ్చుచుండెను. అప్పుడు నాలుగురూపాయలతోనే బీదకుటుంబములు సుఖజీవనము చేయవచ్చును. ఆకాలమునందు భోజనపదార్థము లన్నియు మిక్కిలి చౌక; ఒక్కరూపాయ యిచ్చిన నిప్పుడు వచ్చువాని కంటె నాలుగురెట్లెక్కువగా వచ్చుచుండెను. నాపాలికివచ్చిన యక్కఱకు మాలిన వస్తువు లేవేవో యమ్మివేసి నాతల్లి మాయప్పుల నప్పుడే తీర్చి వేసెను. ఆమె యటుతరువాత సహితము పదిరూపాయలైనను ఋణ మెప్పుడును జేయలేదు. ఆమె గృహకృత్యనిర్వహణమునందు మిక్కిలి సమర్థురాలు; ఒక్క రాగి కాసైనను వ్యర్థముగా నెప్పుడును వ్యయపెట్టలేదు; సమస్త విషయములలోను సుఖలోపము కలుగకుండ మితవ్యయము చేయుచుండెను. తన కడుపు కట్టుకొనియైనను నాకేలోపమును గలుగకుండ నన్న వస్త్రాదులకు జరపుచుండెను. నాతల్లిమిక్కిలి యభిమాన వంతురాలగుటచేత సాయము చేయుఁడని యెప్పుడు నెవ్వరి నడుగ నొల్లకుండెను. మాయం దత్యంతప్రేమము గలిగి మేనమామకుమారుఁడైన తనబావగారిని సహితము తోడుపడుమని యామె యడుగ లేదు. అయినను మాపెదతండ్రిగారు తమ వంతుగృహముమీఁద వచ్చిన యద్దెను గూడ పుస్తకములనిమిత్తమును విద్యనిమిత్తమును నాకే యిచ్చు చుండిరి. ఇది గాక యప్పుడప్పుడు మాకు కొంత ధనసాహాయ్యమును సహితము చేయుచువచ్చిరి.

ఈకాలమునందు నేను జేసినయకార్య మొకటికలదు. అది నామనసు నెంతోకాలము బాధించుచుండెను; నాతల్లిని మోసపుచ్చి నేనుజేసిన నా చిన్ననాటి మోసకార్యమునకై నేను పలుమా ఱనుతాపపడితిని. దీనిని జదువు బాలురు నాదుశ్చేష్టవలన బుద్ధితెచ్చుకొని తా మట్టివంచనము నెప్పుడు జేయక జాగరూకులయి యుండ నేర్చుకొనుట కనుకూలపడు నన్న తలంపుతో దాని నిక్కడ వ్రాయుచున్నాను. నాకాంధ్రభాషాకావ్యపఠనమునం దత్యా