పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

స్వీయ చరిత్రము.

కాల మింటికి వచ్చుచుండుటకును, పాఠశాలజీతమునిమిత్తమిచ్చెడి యెనిమిదణాలును పుస్తకము నిమిత్తము వ్యయ పెట్టుచుండుటకును, నిశ్చయించితిని. ఇటు చేయుట పాపకార్యమని నాయంతరాత్మ నన్ను దూషింపఁ జొచ్చెను గాని పుస్తకపఠనాశామహాభూత మింతలో నడ్డపడి నాకు సహాయమయి యుద్రేకించి, తనసమ్మోహనశక్తిచేత నప్పటికి దాని నోరడఁచి నిద్రపుచ్చి నా దుర్బుద్ధిని ప్రోత్సాహపఱిచినది. పుస్తకపఠనాభిలాషము నన్న వివేకిని జేయఁగా నేను వెంటనే పుస్తకవిక్రేతయగు పందిరి మహాదేవుఁడను వైశ్యునికడకుఁ బోయి, నావాంఛను దెలిపితిని. నాయతిలాలసత్వమును జూచి కనికరించి, పుస్తకము వెల పూర్ణముగా తీఱువఱకును తన పుస్తకవిక్రయశాలలోనే నేను కూరుచుండి దానిని చదువుకొనుచుండునట్లు సమయ మేర్పఱచి, ఆయా పణికుఁడు నాప్రార్థన మంగీకరించెను. ఆవఱకు నాయొద్దనున్న యెనిమిదణాలును నాకప్పుడు నెలజీతముకొఱకిచ్చిన యెనిమిదణాలును జేర్చి యొకరూపాయ పుస్తకవిక్రయికున కిచ్చి యాతనియంగడిలోనే కూరుచుండి యతికుతూహలముతో పుస్తకమును జదువ నారంభించితిని. నేను పాఠశాలకుఁ బోకుండుట రెండవనెలలోనే నాసహపాఠులవలన నాతల్లికిఁ దెలిసినది. వంచనము బయలఁబడక చిరకాల మెప్పుడును దాఁగియుండ నేరదు. అప్పుడామె నన్ను మందలించి, అడిగినతోడనే సత్యము చెప్పినందునకును జీతమును గొనిపోయి మధురాహారములకయి వెచ్చ పెట్టక పుస్తకక్రయమునకు వ్యయపెట్టి నందునకును గొంత సంతోషించి, మిగత సొమ్మిచ్చి నా కాపుస్తకమును గొని పెట్టి, నన్ను మరలఁ బాఠశాలకు బంపెను. దుర్బుద్ధి పొడమినప్పుడు వేగిరపడి యిటువంటి దురాచరణములయందుఁ బ్రవేశింపకుండ వారించుటకయి బాలుర కిది యొక మహోపదేశ మగునుగాక! ఈ యపరాధమునకయి నా ప్రియజనని పుత్రవ్సాల్యముచేత నన్ను మన్నించి యూరకున్నను, కొంతకాలము నిద్రించియుండి మరల మేలుకొన్న నా యంతరాత్మమాత్ర మట్లు చేయక నిర్దయమయి నన్ను నిందింపఁ జొచ్చెను.