పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

369



కంసాలియిల్లు కోయించి యరుగులుత్రవ్వించిన మనము ధనికుఁడయిన యీయన కే న్యాయమునుబట్టి యిప్పు డధికస్థలము కలుపుకొన ననుజ్ఞ యియ్య వచ్చుననియు, చెప్పఁగా నాతోడిసభ్యులు నాతో నేకీభవించి నేను వ్రాసిన నివేదనపత్రముమీఁద వ్రాళ్లుచేసిరి. అప్పుడు చెంతనున్న వెంకటరత్నమునాయఁడు గారు తాను ముందున్న స్థలము కలుపుకొని రథ్యప్రక్కను మేడ కట్టుటకయి యేర్పాటుచేసికొని తదనుసారముగా నిల్లుకట్ట నారంభించితిననియు, ఆస్థల మియ్యకపోయినయెడల వేయఁబడిన పథకమంతయు చెడిపోయి విశేష నష్టము కలుగుననియు, ఏలాగుననైన ననుగ్రహించి యాస్థలమిప్పింప వలసినదనియు ప్రార్థించిరి. ఆయన వేఁడికోలునకు మొగమోటపడి నాతోడివా రిరువురును కొంచెము మెత్త పడిరిగాని నేనుమాత్రము దృఢముగానుండి స్థలమియ్య వలను పడదనియు, మీస్థలములోనే మేడకట్టుకొనుట కేర్పాటుచేసికోక పైస్థలము నపేక్షించినందువలనఁ గలిగెడు నష్టమును మీరుభరింపవలసిన దేయనియు, మొగమోటపడక చెప్పివేసితిని. అందుమీఁద నాయఁడుగారు పారిశుద్ధ్య సభాధ్యక్షులయిన నాగోజీరావు పంతులుగారి యొద్దకుపోయి జరగిన సంగతి విన్నవించిరి. ఆయన సభనుండి యింటికిపోవుచుండఁగా మార్గమధ్యమున నెక్కిన బండి యొక్క చక్రము విఱిగిపోయినందున, ఇంటికాయన నాయఁడుగారి బండిలోనేయెక్కి పోవలసినవారైరి. నాయఁడుగారి విన్నపమును విన్న మీఁదట దాక్షిణ్యపడి నాగోజీరావు పంతులుగారు నాటి సభవారి యుద్దేశ మాస్థలము నాయఁడుగారి కియ్యవలయుటయేయనియు మీ నివేదనపత్రము సభవారిముందు పెట్టఁబడినప్పుడు వారిచ్చుటకంటె ముందుగా మీరే మాట దక్కించుకొనుట బాగుండుననియు, నాకుత్తరము వ్రాసిరి. సభవారెంత స్థలమియ్యవలెనో నిర్ణయించుటకు మాకధికారమిచ్చిరనియు, ఆనిర్ణయవిషయమున మాతీర్పే సునిశ్చితమైనదిగా నుండవలెననియు, మాతీర్పు సభవారెట్లు మార్చెదరో చూచెదమనియు, నేను ప్రత్యుత్తరమిచ్చితిని. దానిపైని నాగోజీరావు పంతులుగారిఁక పెనఁగులాడిన ప్రయోజనము లేదని నాయఁడుగారితో