పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

368

స్వీయ చరిత్రము.



గినను, ఆయాక్రమణమును తీసివేయించుట గొప్ప కష్టముగానుండెను. ఆరోగ్యపరీక్షకుఁడు (Sanitary Inspector) మొదలైనపారిశుద్ధ్యసంఘమువారి సేవకులు తామా యాక్రమణమును తీయించివేయ లేమనియు తామా యరుగు ముట్టుకొన్న పక్షమున తల బద్దలు కొట్టెదనని మామయ్య దుడ్డుకఱ్ఱ చేతఁ బట్టుకొని యరుగుమీఁద కూరుచుండి దరిచేరనీయక పోయెననియు సభవారికి విన్నపము పంపుకొనిరి. దానిపైని సభవారా యాక్రమణమును తన సేవకుల సాహాయ్యమున తీసి వేయించుటకు నన్ను నియమించిరి. నేను కొందఱి సేవకులతో గడ్డపాఱలు పాఱలు పట్టించుకొనిపోయి నేనెదుట నిలుచుండి యరుగు త్రవ్వించుట కారంభించితిని. మామయ్య లోపలినుండి వెలుపలికివచ్చి నన్ను చూచి "యధికారులే యిట్లు నిలుచుండి యిల్లు త్రవ్వించుచుండఁగా బక్కవాండ్రము మే మేమిచేయఁగలము?" అని పలికి మరల లోపలికిపోయెను. నేనరుగు త్రవ్వించివేసి యింటికి పోయితిని.

ఈప్రథానరధ్యలోనే పడఁగొట్టఁబడిన యగసాలియింటి కెదుటివైపున కొంచెము దూరములో నొక స్థలమునుగొని దానిలో నిల్లుకట్టించుకొనుటకయి దానికిముందు రథ్యప్రక్కనున్న యేడడుగుల స్థలము తనకిమ్మని గుడిసేవ వెంకటరత్నముగారు పారిశుద్ధ్య సంఘమువారికి విన్నపము పంపిరి. ఆయన ధనవంతుఁడును చెల్లుబడి గలవాఁడును నగుటచేత నాయన విన్నపము విచారణకువచ్చినప్పుడు సభ్యులలో ననేకు లాస్థలము నియ్యఁదలఁచి యెంత స్థలమియ్యవచ్చునో తెలుపుటకు నన్నును మఱి యిద్దఱు సభ్యులను ఉపసంఘముగా నేర్పఱిచిరి. నేనా సభనుండియే వారి నిరువురను వెంటఁగొని యాస్థలమునకువచ్చి చూచి, స్థలము వంకరగానున్నందున వంకర తీరునట్లు దాని కొననుండి సమరేఖగీచినచో రెండవకొన నేర్పడెడి యడుగువరస్థలమును మాత్రమే యియ్య వచ్చుననియు, రథ్యల ప్రక్కల విశాలముగా స్థలముండుట యావశ్యకమనియు, ఈనడుమనే కొంచెముతావు కలుపుకొనెనన్న హేతువుచేత బీదవాఁడైన